Tuesday, 3 November 2026

తెలంగాణ ఉద్యమ స్పూర్తితో డివిజన్ కోసం ఉద్యమం జూన్ 2న డివిజన్ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం – జేఏసీ చైర్మన్ డాక్టర్ పరమేశ్వర్

చేర్యాల (జనంసాక్షి) మే 30 : తెలంగాణ రాష్ట్ర ఉద్యమ స్ఫూర్తితో జూన్ 2న చేర్యాల రెవెన్యూ డివిజన్ కోసం ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగల్ల పరమేశ్వర్ తెలిపారు. మంగళవారం చేర్యాల పట్టణంలోని వాసవి గార్డెన్లో ఏర్పాటు చేసిన అఖిలపక్ష జేఏసీ సమావేశానికి వారు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. ఒకప్పుడు ఘనమైన చరిత్ర కలిగిన చేర్యాల ప్రాంతం హుస్నాబాద్, దుబ్బాక, గజ్వేల్, ఆలేరు పట్టణాల కంటే ఎంతో ముందు వరుసలో ఉండి పంచాయతీ సమితిగా నియోజకవర్గ కేంద్రంగా, ఒక తాలూకా గా ఉండి తన అస్తిత్వాన్ని కాపాడుకుంటూ వచ్చిన చేర్యాల నేడు మసకబారిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకనాడు ఇందుర్తి నియోజకవర్గం పేరుతో ఉన్నటువంటి హుస్నాబాద్ నేడు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంతో పాటు రెవెన్యూ డివిజన్ కూడా సాధించుకుందన్నారు. అలాగే దుబ్బాక నియోజకవర్గం కూడా ఒకప్పుడు దొమ్మాట నియోజకవర్గం పేరుతో ఉండేదని గుర్తు చేశారు. గజ్వేల్ కూడా మొన్నటిదాకా నియోజకవర్గం కేంద్రంగానే ఉండి నేడు రెవెన్యూ డివిజన్ కేంద్రంగా పరిడవిల్లుతుందన్నారు. గత చరిత్ర తిరిగేసుకుంటే 60 సంవత్సరాల క్రితమే నల్గొండ జిల్లాలో చేర్యాల ఒక మున్సిపాలిటీగా ఉండేది. అలాగే వరంగల్ జిల్లాలో దశాబ్దాల తరబడి నుండి పంచాయతీ సమితిగా, తాలూకా కేంద్రంగా, అసెంబ్లీ నియోజకవర్గంగా, ఉండేదన్నారు. ఇంత ఘనమైన చరిత్ర కలిగిన చేర్యాల నేడు పాలకుల నిరాదరణకు గురై ఒక చిన్న మండలానికి కుదిరించబడి అస్తిత్వాన్ని కోల్పోయి పూర్తిగా మసకబారి పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకని ఈ ప్రాంతంలో ఊపిరి పోసుకున్న బిడ్డలుగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలకమైన పాత్ర పోషించిన ఉద్యమకారులుగా చేర్యాలకు గత పూర్వం వైభవాన్ని తీసుకురావడం కోసం చేసే కృషిలో భాగంగా రెవెన్యూ డివిజన్ సాధన కోసం తెలంగాణ రాష్ట్ర ఉద్యమ స్ఫూర్తితో, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజైన జూన్ 2న చేర్యాల పాత నియోజకవర్గ పరిధిలోని అన్ని రాజకీయ పార్టీల ముఖ్యనాయకులు, తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు, ప్రజాసంఘాల నాయకులతో కలిసి రిటైర్డ్ ఉద్యోగులు, సీనియర్ సిటిజన్స్ అందరూ కలిసి స్థానిక చేర్యాల పట్టణంలోని వాసవి గార్డెన్ లో మధ్యాహ్నం 12 గంటలకు విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చేర్యాల రెవెన్యూ డివిజన్ కోసం ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తామని వారు వెల్లడించారు. ఈ విస్తృత స్థాయి సమావేశానికి అందరూ హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈసమవేశంలో జేఏసీ కో చైర్మన్ పూర్మ ఆగంరెడ్డి, సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆది శ్రీనివాస్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్, ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ జిల్లా కార్యదర్శి అందె బీరయ్య, మాజీ జడ్పీటీసీలు కొమ్ము నర్సింగరావు, దాసరి కళావతి, మాజీ సర్పంచ్ అవుశర్ల యాదయ్య, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి బుట్టి సత్యనారాయణ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు తడక లింగం గుప్త, అఖిలపక్షం,జేఏసీ నాయకులు ఈరి భూమయ్య, కాటం మల్లేశం, తాడెం ప్రశాంత్, పుట్ట రాజు, గూడ రాజిరెడ్డి, బిజ్జ రాము, బండి సుదర్శన్, రిటైర్డ్ ఉద్యోగులు బుట్టి బాగయ్య, శ్రీరామ్ మల్లేషం, ఉడుగుల శ్రీనివాస్, బండకింది అరుణ్ కుమార్, తాడెం వెంకట స్వామి, తదితరులు పాల్గొన్నారు.