హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్ తెలంగాణ కోసం పార్లమెంటులో మాట్లాడకుండా సూర్యాపేటలో మాట్లాడితే తెలంగాణ వస్తుందా అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. తెలంగాణపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి చేయాల్సిన కేసీఆర్ ఉద్యమాన్ని నిలబెట్టాలని సూర్యాపేటలో బహిరంగసభ నిర్వహించడం స్వార్థం కోసమేనని దుయ్యబట్టారు. ఉద్యమం పేరుచెప్పి కాయలమ్ముకుంటున్నాడని ఆరోపించారు. పార్టీ బలహీనపడిన ప్రతిసారి ఓ సమావేశం పెట్టి దానికి జవజీవాలు పోస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ వేల కోట్ల రూపాయలకు అమ్ముకుంటూ వ్యాపారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణకు కింగ్ ఆఫ్ ద చీటర్స్ అండ్ రాబర్స్ అని వ్యాఖ్యానించారు. కేసీఆర్, కోదండరామ తెలంగాణ దొరలని విమర్శించారు. వారిని తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయని అన్నారు.




