Tuesday, 3 November 2026

తెలంగాణ రాష్ట్రంలో నేడు, రేపు.. ఎండలు తీవ్రం

 వడగాడ్పులు మరింత  ఉద్ధృతం
 హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో బుధ, గురువారాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగి వడగాడ్పులు వీస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, మధ్యాహ్న సమయంలో ఎండల్లో తిరగరాదని హెచ్చరించింది. వేసవి ఎండలు తీవ్రంగా ఉన్నందున పొడి, వేడిగాలుల ఉద్ధృతి మరింత పెరగనుంది. మంగళవారం వడగాడ్పులకు రాష్ట్రంలో 30 మంది మరణించారు. నల్గొండ జిల్లాలో ఎనిమిది మంది, వరంగల్‌ జిల్లాలో ఆరుగురు, మహబూబ్‌నగర్‌, మెదక్‌ జిల్లాల్లో నలుగురు చొప్పున, హైదరాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో ముగ్గురేసి, ఆదిలాబాద్‌ జిల్లాలో ఇద్దరు చనిపోయారు. మంగళవారం నిజామాబాద్‌లో అత్యధికంగా 43 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. బుధ, గురువారాల్లో పలు చోట్ల గరిష్ఠంగా 42 నుంచి 45 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయి. అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గాలులతో జల్లులు పడే అవకాశాలూ ఉన్నాయి. క్యుములోనింబస్‌ మేఘాలు ఏర్పడి పెనుగాలులతో వడగండ్లు కూడా పడవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *