హైదరాబాద్: తెలంగాణ విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ లాంటి వైరల్ ఫీవర్ల బారిన పడే వారి సంఖ్య ఆందోళనకరస్థాయిలో పెరిగిపోతోంది. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో రోగులు క్యూ కడుతున్నారు. కొద్దిరోజులుగా స్వైన్ ఫ్లూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. వాతావరణంలో వచ్చిన మార్పులతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధుల బారిన పడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దోమలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో జనం వైరల్ ఫీవర్ల బారిన పడుతున్నారు. దీనితో రోగులతో ఆస్పత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి.హైదరాబాద్‌లోనే కాదు మారుమూల ప్రాంతాల్లో కూడా జనం విషజ్వరాల బారిన పడుతున్నారు. తెలంగాణలో దాదాపు 5న్నర లక్షల మంది జ్వరాలతో బాధపడుతున్నట్లు వైద్యఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 2184 మలేరియా, 1185 డెంగీ, 15 చికున్‌గున్యా కేసులు నమోదు అయ్యాయి. డెంగీ బారిన పడి కొద్దిరోజుల క్రితం నలుగురు మృతి చెందారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం వల్ల కొంత వరకు విషజ్వరాలు రాకుండా చూసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. కొద్దిరోజులుగా వాతావరణం చల్లగా మారడంతో వైరల్ ఫీవర్లు, విషజ్వరాలతో పాటు స్వైన్ ఫ్లూ లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో నలుగురు రోగులు స్వైన్‌ఫ్లూ లక్షణాలతో చేరారు. కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ఈ కేసులు నమోదు అవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. సీజనల్ వ్యాధులతో పాటు స్వైన్‌ఫ్లూ అనుమానిత కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం సీజనల్ వ్యాధులు విజృంభించకుండా తగిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. అటు హైదరాబాద్ నగరం కూడా వైరల్ ఫీవర్స్‌తో అల్లాడిపోతోంది. ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లలేని వారంతా ఫీవర్ ఆస్పత్రికి క్యూకడుతున్నారు. అయితే ఎమర్జెన్సీ పేషెంట్లను కూడా లైన్లలో రావాలంటూ ఆస్పత్రి సిబ్బంది వేధిస్తున్నారు.




