రెండేళ్ల క్రితం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఏపీఎస్ ఆర్టీసీని టీఎస్‌ఆర్టీసీగా మార్చిన విషయం విదితమే. తెలంగాణ ప్రాంతంలోని అన్ని బస్సులపై టీఎస్‌ఆర్టీసీ అనే కనిపిస్తుంది. ఇక ఆర్టీసీ డిపోలు, బస్టాండ్‌లపైకూడా తెలంగాణ రాష్ట్రరోడ్డు రవాణాసంస్థ అనే ముద్రించారు. కాని ఈ బస్సుల్లో ఇచ్చే టిక్కెట్లపై మాత్రం ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణాసంస్థ అని ఉండడం గమనార్హం. దాదాపు మెజార్టీ బస్సుల్లో టిమ్ యంత్రాల ద్వారానే కండక్టర్లు టిక్కెట్లు ఇస్తున్నారు. వీటిపై టీఎస్‌ఆర్టీసీ అని ముద్రించి ఉండడంతో పాటు డ్రైవర్, కండక్టర్‌కు సంబంధించిన విషయాలు, డిపో చిరునామా, ఇతర వివరాలు స్పష్టంగా ఉంటాయి. ఇక పాతపద్ధతిలో ముద్రణతో ట్రేద్వారా ఇస్తున్న టిక్కెట్లపై మాత్రం తెలంగాణకు సంబంధించిన ఆనవాళ్లే కనిపించడం లేదు. తాజాగా మెదక్‌జిల్లా కేంద్రం సంగారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ నియోజకవర్గమైన గజ్వేల్‌కు వెళ్లే రూట్‌లో తిరుగుతున్న ఆర్డినరీ బస్సుల్లో ఏపీ ఎస్‌ఆర్‌టీసీ టిక్కెట్లు ఇస్తున్నా రు. అంతేగాకుండా మరికొన్నిరూట్లలో కూడా ఈ టిక్కెట్లనే పంపిణీ చేస్తున్నట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై రెండేళ్లు దాటుతున్నా ఇంకా ఆంధ్రప్రదేశ్ పేరిట ఉన్న టిక్కెట్లు పంపిణీ చేయడంపై ప్రయాణికులు ముక్కు నవేలేసుకుంటున్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలతోపాటు ప్రభుత్వరంగ సంస్థల బోర్డులపై అధికారికంగా ‘తెలంగాణ రాష్ట్రం’ అని ముద్రించిన ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి ఈ టిక్కెట్ల వ్యవహారం వెళ్లినట్లు లేదని పలువురు చెపుతున్నారు.సాక్షాత్తు ముఖ్యమంత్రి సొంతజిల్లాలోనే ఆర్టీసీ బస్సుల్లో ఆంధ్రప్రదేశ్ టిక్కెట్లు జారీ అవుతుండడం చర్చనీయాంశంగా మారింది. టిక్కెట్ల విషయాన్ని ఆర్టీసీ అధికారులైనా సర్కారుకు విన్నవించలేకపోయారా? అనే వాదనలు లేకపోలేదు. దీనిపై మెదక్‌జిల్లా ఆర్టీసీ అధికారులను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా.. ఆర్టీసీ బస్సుల్లో టిమ్‌ల ద్వారానే టిక్కెట్లు ఇస్తున్నామని తొలుత పేర్కొని.. గతంలో నిల్వ ఉన్న అప్పటి టిక్కెట్లు కూడా డిపోల్లో ఉన్నాయని చెప్పారు. వీటి వివరాలు సేకరిస్తామని తెలిపారు.




