Tuesday, 3 November 2026

తెలంగాన అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగంపై చర్చ

సీఎం కేసీఆర్‌ అభివృద్దిక బాటలు వేశారన్న టిఆర్‌ఎస్‌ సభ్యులు
హైదరాబాద్‌,మార్చి9(జ‌నంసాక్షి): తెలంగాణ  శాసనసభలో గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ ప్రారంభమయ్యింది.  చర్చను ప్రారంభించిన  టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధిపై గవర్నర్‌ ప్రసంగంలో సమగ్రంగా చెప్పారని తెలిపారు. గ్రామాల్లో వృద్ధులంతా సీఎం కేసీఆర్‌ తమ పెద్ద కుమారుడు అని చెప్పుకుంటున్నారని గుర్తు చేశారు. ప్రతి వృద్ధుడు గౌరవంగా బతకాలనే ఉద్దేశంలో పెన్షన్లు పెంచామని పేర్కొన్నారు. దళితులకు మూడెకరాల భూమిని పంపిణీ చేస్తున్నామని ప్రకటించారు. ప్రతి ఇంటికీ మంచినీరు అందించాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని ఉద్ఘాటించారు. అందుకే వాటర్‌గ్రిడ్‌ పథకం చేపట్టామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ తెలంగాణ అంతా తిరిగి సమస్యలను తెలుసుకుంటున్నారని తెలిపారు. సమస్యలను పరిష్కరించే విధంగా సీఎం ముందుకెళ్తున్నారని ఉద్ఘాటించారు. ఐఏఎస్‌ అధికారులు తగినంతగా లేకున్నా అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందని తేల్చిచెప్పారు.

చంద్రుడి కిరణాలతో వికసించనున్న యువత

బంగారు తెలంగాణ సాధనలో సిఎం కెసిఆర్‌ తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. ఆయన చల్లని కిరణాలతో యువత బంగారు తెలంగాణలో పునరంకితం అవుతన్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి టీఆర్‌ఎస్‌ సర్కార్‌ కట్టుబడి ఉందని  ఉద్ఘాటించారు. శాసనసభలో ధన్యవాద తీర్మినంపై గొంగిడి సునీత మాట్లాడుతూ గత ప్రభుత్వాలు మాటలకే పరిమితమయ్యాయి. తాము మాటలు కాదు.. చేతల్లో చూపిస్తున్నామని తెలిపారు. అంబేద్కర్‌ స్ఫూర్తితో ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. ఆడపిల్లలను ఆదుకోవడానికి ప్రభుత్వం గొప్ప సంకల్పంతో ముందుకెళ్తుంది. ఎస్సీ, ఎస్టీలకు కళ్యాణలక్ష్మి పథకం, ముస్లిం యువతులకు షాదీ ముబారక్‌ పథకాన్ని ప్రవేశపెట్టి ప్రభుత్వం వారి వివాహాలను ఆర్థిక సాయం చేస్తుందన్నారు. దళితవాడల్లో వెలుగులు నింపేందుకు మూడెకరాల భూమి పంపిణీ చేస్తున్నామని స్పష్టం చేశారు. హాస్టళ్లలో సన్న బియ్యం పెట్టి విద్యార్థులకు మెరుగైన విద్యనందించేందుకు సర్కార్‌ కృషి చేస్తుందన్నారు. గత ప్రభుత్వాలు 4 లక్షల ఇండ్లు కట్టించినట్లు చూపి.. ఒక లక్ష ఇండ్లు కట్టకుండానే బిల్లులు ఎత్తుకున్నారని తెలిపారు. ఇది తాము చెప్పడం లేదని సీఐడీ విచారణలో తేలిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చామని గుర్తు చేశారు. జర్నలిస్టులకు కూడా అక్రిడేషన్లు, హెల్త్‌ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం కృష్టి చేస్తుందన్నారు. యాదగిరిగుట్ట అభివృద్దికి వందకోట్లు కేటాయించి అభివృద్దికి కృషఙ చేయడం అభినందనీయమన్నారు. అన్ని వర్గాల అభివృద్ది ధ్యేయంగా సిఎం పనిచేస్తున్నారని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *