దళితుల అభ్యున్నతికి ప్రణాళికాబద్ధంగా చర్యలు – మంత్రి కొప్పుల

 

-దళిత బంధు పథకాన్నివినియోగించుకొని రెట్టింపు సంపద సృష్టించాలి

-184 మందికి 50 వేల విలువ గల యూనిట్లు పంపిణీ

-ఎస్సీ యూనిట్ ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి

దళితుల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.శుక్రవారం పెద్దపల్లి మార్కెట్ యార్డులో ఎస్సీ యూనిట్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి లతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బ్యాంకు లింకేజీ తో సంబంధం లేకుండా చిరు వ్యాపారాలు చేసుకునేందుకు దళితులకు 50 వేల రూపాయలతో యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని, బ్యాంగిల్ షాపులు, పూజ సామాగ్రి దుకాణం, పూల దుకాణం, టీ షాప్ వంటి చిరు వ్యాపారాలు చేసుకునేందుకు ప్రభుత్వం సహాయం చేసిందని అన్నారు.దళితుల అభ్యున్నతికి ప్రణాళిక బద్ధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, గతంలో దళితుల కోసం ఉన్న గురుకుల పాఠశాలలను సీఎం కేసీఆర్ రెట్టింపు చేశారని, గతంలో లేనివిధంగా మహిళ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేశారని, దళితులు పెద్ద చదువులు చదివే దిశగా చర్యలు తీసుకున్నారని, విదేశాలలో చదివే దళిత యువత కోసం అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం అమలు చేస్తున్నారని మంత్రి తెలిపారు.దళిత ప్రజలు అధికంగా నివసించే ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, త్రాగునీటి సరఫరా, వంద యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా వంటి అనేక మౌళిక వసతులను ప్రభుత్వం కల్పిస్తుందని, రాష్ట్ర వ్యాప్తంగా దళితుల కోసం అనేక కమ్యూనిటీ కేంద్రాలను సీఎం కేసీఆర్ నాయకత్వంలో నిర్మించుకున్నామని మంత్రి తెలిపారు.గత ప్రభుత్వాలు దళితులకు స్వయం ఉపాధి కింద కేవలం 20 శాతం మాత్రమే సబ్సిడీ అందించేవని, బ్యాంకు లింకేజీ వల్ల ప్రభుత్వం సబ్సిడీ విడుదల చేసినప్పటికీ యూనిట్ల ఏర్పాటులో తీవ్ర జాప్యం జరుగుతుందని, దీనిని గమనించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల కోసం వంద శాతం సబ్సిడీతో బ్యాంకు లింకేజీ లేకుండా 10 లక్షలు సహాయం అందించేందుకు దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని మంత్రి తెలిపారు.దళిత బంధు పథకం ద్వారా దళితులు ఆర్థిక పురోగతి సాధిస్తున్నారని, సిరిసిల్ల జిల్లాలో 5 గురు దళితులు కలిసి రైస్ మిల్ ఏర్పాటు చేశారని, ఇద్దరు దళితులు వారికి వచ్చిన ప్రభుత్వ సహాయానికి మరికొంత బ్యాంకు రుణం తీసుకుని ఆర్టీసీ బస్సు కొనుగోలు చేసి నెలకు ఒక్కొక్కరు 50 వేలకు పైగా సంపాదిస్తున్నారని, మరికొంతమంది కిరాణా షాపులు, హోల్ సేల్ కూల్ డ్రింక్ షాపులు, సారి దుకాణాలు ఏర్పాటుచేసి సంపాదిస్తున్నారని మంత్రి తెలిపారు.దళిత బంధు పథకం ద్వారా సంపద సృష్టి జరుగుతుందని, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని, తద్వారా మరిన్ని దళిత కుటుంబాలకు సహాయం అందించే అవకాశం లభిస్తుందని మంత్రి అన్నారు. రెండవ విడత దళిత బంధు కింద ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 1100 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా దళిత బంధు పథకాన్ని అమలు చేస్తామని మంత్రి అన్నారు.దళిత బంధు పథకం కింద ప్రభుత్వం అందించే పది లక్షల సబ్సిడీ సొమ్మును వినియోగించుకొని ప్రతి దళితులు రెట్టింపు సంపద సృష్టించాలని, మన జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవాలని మంత్రి తెలిపారు. ‌ఎస్సీ కార్పొరేషన్ కింద 50 వేల యూనిట్లు అందుకున్న వారికి సైతం భవిష్యత్తులో దళిత బంధు పథకం అమలు అవుతుందని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం అందించే సహాయాన్ని సద్వినియోగం చేసుకుంటూ రెట్టింపు సంపద సృష్టిపై దృష్టి సారించాలని, మార్కెట్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు అవగాహన కల్పించుకుంటూ అధిక లాభం కలిగే యూనిట్ల ఏర్పాటుపై మొగ్గు చూపాలని, అందరూ ఒకే వ్యాపారం చేయడం వల్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని, యూనిట్ల ఎంపిక సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని మంత్రి సూచించారు.ఈ కార్యక్రమంలో జడ్పి ఛైర్మన్ పుట్ట మధు, స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, పెద్దపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ మమతారెడ్డి, జెడ్పిటిసిలు, పెద్దపల్లి ఎంపీపీ స్రవంతి శ్రీనివాస్, వివిధ ప్రజాప్రతినిధులు, ఈ.డి. ఎస్.సి. కార్పొరేషన్ మధుసూదన శర్మ, సంభందిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు