Monday, 2 November 2026

దళితుల భూ పంపిణీ కోసం బడ్జెట్‌ కేటాయించాలి: సిపిఎం

హైదరాబాద్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): దళితులకు మూడెకరాల భూపంపిణీ అమలుకు అనుగుణంగా బడ్జెట్‌ కేటాయింపులు రూపకల్పన చేయాలని సిపిఎం రాష్ట్ర తొలి మహాసభల ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి డిజి నరసింహారావు డిమాండ్‌ చేశారు. దళితులకు భూపంపిణీ అమలు జరగడం లేదన్నారు. బడ్జెట్‌ కేటాయింపులు చేపట్టి అందుకు కాలవ్యవధిలో కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. రాష్ట్రంలో భూ సమస్య తీవ్రంగా ఉందన్నారు. ఎస్సీలకు మూడెకరాల భూమి ఇస్తామని ప్రభుత్వమే ముందుకొచ్చిందని అన్నారు.సిపిఎం మహాసభల్లో ఈ అంశాన్ని ప్రధానంగా చర్చిస్తామని అన్నారు. ఉపాధి హావిూ చట్టం, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను పటిష్టంగా అమలు చేయాలని కోరారు. బిసి సబ్‌ప్లాన్‌ కావాలన్న సమస్య ముందుకొస్తోందని, మహాసభల్లో చర్చిస్తామని తెలిపారు.   బడ్జెట్‌ను పరిశీలించి భూమి, ఇళ్లస్థలాల కోసం ఉద్యమిస్తామని చెప్పారు. ఇలాంటి సమస్యలతోపాటు మొత్తం 30 అంశాలపై తీర్మానాలు చేస్తామన్నారు. విద్యావైద్య రంగాల్లో ప్రయివేటు, కార్పొరేట్‌ సంస్థల దోపిడీ పెరిగిపోయిందన్నారు. ప్రయివేటు ఆస్పత్రులు, విద్యాసంస్థలు ఇష్టా రాజ్యంగా దోపిడీ చేస్తున్నాయని విమర్శించారు. ఫీజుల వసూలుకు నియమం లేదన్నారు. ఫీజుల వసూలుకు నియమం ఉండాలని సూచించారు. ఫీజు నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ భూములు  తీసుకున్న ఆస్పత్రులు 15 శాతం బెడ్స్‌ ప్రజలకు ఉచితంగా సేవలందించాలని గుర్తు చేశారు. ఈ డిమాండ్‌ సాధనకు ప్రత్యక్ష ఉద్యమాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. మహాసభలకు అతిధులుగా సిపిఎం నేతలు ప్రకాశ్‌కరత్‌, సీతారాం ఏచూరి, రామచంద్రన్‌పిళ్లై, ఎంఎ బేబి, బివి రాఘవులు హాజరవుతున్నారని చెప్పారు. మార్చి 4న రెడ్‌షర్ట్‌ వాలంటీర్ల కవాతు 50 వేల మందితో సుందరయ్య పార్క్‌ నుంచి నిజాం కాలేజీగ్రౌండ్స్‌ వరకు నిర్వహిస్తామన్నారు. ఇందిరాపార్క్‌ నుంచి నిజాం కాలేజీ గ్రౌండ్స్‌ వరకు సాంస్కృతిక ప్రదర్శన

ఉంటుందని, ఇందులో డప్పులు, కోలాటాలు, నృత్యం, విచిత్ర వేషధారణ, వృత్తులు వంటి అనేక అంశాలు ఆకర్షణీయంగా ఉంటాయన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *