అనేకానేక సమస్యలపై ప్రత్యక్ష పోరాటాలకు నిర్ణయం
హైదరాబాద్,ఫిబ్రవరి28(జనంసాక్షి): తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తరవాత సిపిఎం మహాసభలు తొలిసారిగా హైదరాబాద్ వేదికగా జరగునున్నాయి. మార్చి 1 నుంచి 4 వరకు సభలకు ఏర్పాటు చేశారు. దీంతో నగరంలో ఎర్రజెండాలు రెపరెపలాడుతున్నాయి. బడ్జెట్ సమావేవాలకు ముందు జరుగుతన్న ఈ సభలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అనేక సమస్యలను ఇందులో చర్చించి తీర్మానాలు చేస్తారు. తెలంగాణ ఏర్పడ్డ తరవాత ఎదుర్కొటున్న, పరిస్కారం కాని వివిధ సమస్యలను చర్చించే వీలుంది. 1 నుంచి 4వరకు హైదరాబాద్‌లో జరిగే సిపిఎం రాష్ట్ర తొలి మహాసభల ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలంగాణ రాస్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. మార్చి 1న తెలంగాణ జనజాతరను ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, సాంస్కృతిక ఎగ్జిబిషన్‌ను ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు ప్రారంభిస్తారని చెప్పారు. మార్చి 2న జనజాతరకు గద్దర్ రావడానికి అంగీకరించారని తెలిపారు. సినీనటులు రాజేందప్రసాద్ ఓ వేదికను ప్రారంభిస్తారని అన్నారు. మంచి సినిమాలు తేవడానికి చర్చాగోష్టులు నిర్వహిస్తామన్నారు. అభ్యుదయ సినిమాల కోసం అందరితో చర్చించి ప్రోగ్రెసివ్ వేదిక ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ వంటావార్పు, చేతివృత్తులు, యాస, భాష, సంస్కృతి ప్రతిబింబించే విధంగా స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. షార్ట్‌ఫిల్మ్ థియేటర్‌లో సినిమా ప్రదర్శనలుంటాయని చెప్పారు. నగర ప్రజలు హాజరై అన్నింటినీ తిలకించి జయప్రదం చేయాలని కోరారు. సిపిఎం ఇప్పటి వరకు ఆర్థికరంగ పోరాటాలపై కేంద్రీకరించి పనిచేసిందని అన్నారు. సాంస్కృతిక రంగానికి ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. మహాసభల్లో రాజకీయ నిర్మాణ నివేదికతోపాటు సాంస్కృతిక నివేదికను ప్రవేశపెడుతున్నామని వివరించారు. సాంస్కృతిక రంగంపైనా కేంద్రీకరించి పనిచేస్తామని చెప్పారు. మహాసభల్లో చర్చించి కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు. వామపక్ష ఐక్యతకు కృషి చేస్తున్నామని తెలిపారు. వామపక్ష, ప్రజాతంత్ర, సామాజిక శక్తుల ఫ్రంట్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని వివరించారు. సమాజంపై, ప్రజల ఆలోచనలపై సంస్కృతి,సంప్రదాయాలు ప్రభావం చూపుతున్నాయని చెప్పారు. కులం అంటుజాడ్యంలా వ్యాపిస్తోందని తెలిపారు. ఎపస్పటిలాగే కుల నిర్మూలన కోసం పనిచేస్తామన్నారు. మోడీ సర్కారు వచ్చాక మతోన్మాదం, మత ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సాహిత్యం, కళలు, నృత్యం, టివి, ఇంటర్‌నెట్, సోషల్ విూడియా మనుషుల మెదళ్లపై ప్రభావం చూపుతున్నాయని అన్నారు. ఈ సమస్యలపై చర్చించి పోరాడేందుకు రాష్ట్ర మహాసభ వేదిక కానుందని అన్నారు. ప్రత్యామ్నాయ విధానాలతోనే బంగారు తెలంగాణ, నవ తెలంగాణ, ప్రజా తెలంగాణ నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. వామపక్ష శక్తులే ప్రత్యామ్నాయమని చెప్పారు. అలాగే ప్రయివేటు రంగంలో రిజర్వేషన్ల సాధనకు పెద్దఎత్తున ఉద్యమిస్తామని తమ్మినేని వీరభద్రం చెప్పారు. భవిష్యత్తులో ప్రభుత్వరంగం కనుమరుగయ్యే ప్రమాదముందని చెప్పారు. ప్రయివేటు ఆధిపత్యం రోజురోజుకూ పెరుగుతున్న దశలో రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. పార్టీ రాష్ట్ర మహాసభల్లో చర్చించి ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని హెచ్చరించారు.




