Monday, 2 November 2026

దళిత రత్నాల విగ్రహాలను ఆవిష్కరించిన మందకృష్ణ మాదిగ – హాజరైన ప్రొఫెసర్లు ఖాసీం, సూరేపల్లి సుజాత

మునగాల, మే 31(జనంసాక్షి): మునగాల మండల పరిధిలోని గణపవరం గ్రామంలో దళిత రత్నాల విగ్రహాలను ఎపిజెబి నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన గౌతమబుద్ధ, జ్యోతిరావు పూలే, జగ్జీవన్ రామ్, డా. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, మహాజన సోషలిస్ట్ పార్టీ అధినేత మందకృష్ణ మాదిగ, భరత భూషణ్ ప్రొఫెసర్ ఖాసీం, ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత హాజరై మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో వారు మాట్లాడుతూ, సమాజ హితం కోసం సర్వ సుఖాలను త్యాగం చేసిన మహోన్నతుడు గౌతమ బుద్ధుడని కొనియాడారు. మానవ వికాసానికి హేతుబద్ధమైన గొప్ప జీవన మార్గాన్ని ఆయన ప్రపంచానికి అందించారని కీర్తించారు. నిమ్న జాతులకు గౌరవప్రదమైన వెలుగును నింపడానికి మొట్టమొదటి పాఠశాలను స్థాపించి, తన భార్య అయిన సావిత్రిబాయి పూలేను ఉపాధ్యాయురాలిగా నియమించిన విద్యాప్రదాత మహాత్మ జ్యోతిరావు పూలే అని అన్నారు. అటువంటి చిరస్మరణీయుల చరిత్ర వర్తమానానికి అందించాల్సిన ఆవశ్యకతను వారు వివరించారు. చదువుతోటే పురోగతి సాధ్యం అని మొదట గుర్తించింది పూలే అని ఆయన గుర్తు చేశారు. చదువు లేక పోవడంతో పాటు కులాల పునాదుల మీద నిర్మాణం జరిగిన భారతదేశం మీదకు వైశాల్యంలో గాని, జనాభా పరంగా గాని నూరో వంతు కుడా లేని దేశాలు దండయాత్ర సాగించయన్నారు. అటువంటి విపత్కర పరిస్థితులను అధిగమించి ఉన్నతి కేగిన రత్నాలలో బాబు జగ్జీవన్ రామ్ ఒకరు అని వారు కొనియాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా వర్గాలతో పాటు పేదలైన అగ్రకులాల ప్రజలకు కూడా మానవీయ పాలన అందిస్తున్నారు. అంబేద్కర్ మహానుభావుడు కలలుగన్న భారతదేశంలో భిన్నత్వంతో కూడిన ప్రత్యేక ప్రజాస్వామిక లక్షణం ఉన్నది. ఫెడరల్ స్పూర్తిని అమలు చేయడం ద్వారా మాత్రమే అన్ని వర్గాలకు సమాన హక్కులు అవకాశాలు కల్పించబడుతాయనే అంబేద్కర్ స్పూర్తి మమ్మల్ని నడిపిస్తున్నదని భారతదేశ ప్రజలు కుల, మత, లింగ, ప్రాంతాల వివక్ష లేకుండా అన్ని వర్గాలు సమానంగా గౌరవించబడి, అందరికీ సమాన అవకాశాలు కల్పించబడడమే నిజమైన భారతీయత అని అన్నారు. ఈ కార్యక్రమంలో బండారు సైదులు, సూరేపల్లి వెంకటేశ్వర్లు, పోడెటి చంద్రయ్య, బచ్చలకూర జార్జి, అంజయ్య, వెంకయ్య, యం వెంకయ్య, మనోజ్ కుమార్, రమేష్, జాన్ విల్సన్, ఎ రాజు, ఎల్ పి శీను, సర్పంచ్ కొండపల్లి విజయ నర్సింహారావు, జితేందర్ రెడ్డి, నెమ్మది శ్రీనివాసరావు, కె. ఆంజనేయులు,‌ ప్రజా సంఘాలు, దళిత బహుజన సామాజిక వేత్తలు తదితరులు‌ పాల్గొన్నారు.