Thursday, 5 November 2026

దాదాగిరి సభలో నడవదు : ఆరుణపై కేటీఆర్ ఫైర్

Minister KTR fire on DK Aruna

హైదరాబాద్ : మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ అనుచిత వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రిగా పనిచేసిన వ్యక్తులు రౌడీల్లాగ మాట్లాడటం సరికాదన్నారు. వారి జిల్లాలో చేసిన విధంగా అసెంబ్లీలో దాదాగిరి చేస్తానంటే కుదరదని కేటీఆర్ హెచ్చరించారు. గద్వాలలో చేసినట్లు బంగ్లా రాజకీయాలు చట్టసభలో చేస్తానంటే కఠిన చర్యలుంటాయన్నారు. ప్రభుత్వంపైనా, బాధ్యతగల మంత్రులపైనా అడ్డగోలుగా మాట్లాడేటపుడు కాస్త ఆలోచించి మాట్లాడాలని సూచించారు.

రాష్ట్ర కేబినెట్లో మహిళా మంత్రులకు చోటేదని ప్రశ్నించిన అరుణకు కేటీఆర్ ధీటుగా సమాధానం చెప్పారు. కొన్ని సమీకరణాల వల్ల కేబినెట్లో మహిళలకు ప్రాతినిధ్యం దక్కలేదని, కానీ మీలాగా మహిళా మంత్రులపై కేసులు పెట్టే పరిస్థితి రాలేదన్నారు. మహిళా అధికారిణిలను జైలుకు పంపే దౌర్భాగ్యం తెలంగాణ ప్రభుత్వానికి రాదని కేటీఆర్ బదులిచ్చారు.

డీకే అరుణ సభలో అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్, ఆర్‌అండ్‌బి మినిస్టర్‌లు ఎంతో సావధానంగా సమాధానం చెప్పారు. ఎంతో కూల్‌గా వివరణ ఇచ్చారు. ఇదే సందర్భంలో ఎమ్మెల్యే ఏనుగు రవిందర్‌రెడ్డి మాట్లాడుతూ… గతంలో మంత్రులుగా ఉన్న మీరు, చిన్నారెడ్డిలు ఏంచేశారని ప్రశ్నించగా నువ్ నోర్మూసుకో అని డీకే ఆరుణ వ్యాఖ్యానించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. డీకే ఆరుణ మాట్లాడిన మాటల ఫుటేజీని పరిశీలించిన తరువాత ఆమెపై చర్యలు తీసుకునే అవకాశముంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *