– రాముడి పేరు చెప్పుకుని రావణాసురుడి పాలన సాగిస్తుంది
– అర్థరాత్రి నిర్ణయాలతో సీబీఐ ప్రతిష్టను దిగజార్చారు
– ఏపీ ప్రభుత్వాన్ని అస్థిరపర్చడానికి కుట్ర జరుగుతుంది
– ఎన్నడూలేనిది జీవీఎల్, రామ్మాధవ్లకు ఇప్పుడు ఏపీ గుర్తుకొచ్చిందా?
– బీజేపీ నేతల కుట్రలు ఏపీలో సాగవు
– ఏపీ మంత్రి కేఈ కృష్ణమూర్తి
అమరావతి, అక్టోబర్30(జనంసాక్షి) : దేశంలో రాముని పాలన సాగిస్తామని అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం.. రావణాసురుడి పాలన సాగిస్తూ దేశంలో వ్యవస్థలన్నింటిని బ్రష్టుపట్టించిందని మంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. మంగళవారం అమరావతిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.. సీఎం చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలకు సేవ చేయడం ఎంత ముఖ్యమో, దేశ భవిష్యత్తు కూడా అంతే ముఖ్యమని మంత్రి తెలిపారు. బీజేపీనేత రామ్ మాధవ్ వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ఏమైనా కుట్ర పన్నుతున్నారా అనే సందేహం కలుగుతోందని అన్నారు. బీజేపీ నాయకుల్లాగా వ్యవస్థలన్నింటినీ భ్రష్టుపట్టించి పదవులు కాపాడుకోవాలని తాము తాపత్రయ పడటం లేదన్నారు. దశాబ్దాల క్రితమే రాష్ట్రాన్ని వదిలి వెళ్లిన రామ్ మాధవ్, జీవీఎల్ ఇప్పుడు రాష్ట్రం పై లేనిపోని ప్రేమ ఒలకబోస్తున్నారని యద్దేవా చేశారు. రామ్ మాధవ్, జీవీఎల్ రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే రాష్ట్ర బిజేపీ నాయకులు వారికి వంతపాడుతూ తెలుగువారి ఆత్మాభిమానాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారని వాపోయారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విడుదల విషయంలో అన్యాయం జరుగుతున్నా, నోరు మెదపని బీజేపీ నాయకులు, చిల్లర విషయాల గురించి చాలా ధారాళంగా మాట్లాడుతున్నారని యద్దేవా చేశారు. బీజేపీ నేత్రుత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలోని వ్యవస్థలన్నింటినీ భ్రస్టుపట్టిస్తుందన్నారు. తమకు వ్యతిరేకంగా ఉన్న ప్రత్యర్ధి పార్టీలు, నాయకుల విూద కేంద్ర విచారణ సంస్ధలను ఉసిగొల్పి దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశంలోని అత్యుత్తమ విచారణ సంస్థ అయిన సీబీఐ అవినీతి ఆరోపణలతో రోడ్డున పడిందన్నారు. ప్రపంచ దేశాలలో మన సిబిఐ ప్రతిష్ఠను తన అర్ధరాత్రి నిర్ణయాలతో కేంద్ర ప్రభుత్వం దిగజార్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థ విూద ప్రజలు నమ్మకం కోల్పోయారని, దేశ ప్రజలు మోడీ విూద ఎన్నో ఆశలు పెట్టుకున్నా.. ఆయన ఒంటెద్దుపోకడ, ఏకపక్ష నిర్ణయాల వల్ల జాతీయ స్థూల ఉత్పత్తి పడిపోయిందని కేఈ విమర్శించారు. ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, బిజేపీ నాయకులు భారత్ వెలిగిపోతుందని డప్పాలు కొట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి బిజేపీ ప్రభుత్వంలో సామాన్యులు రగిలిపోతున్నారని అన్నారు. రాముడి పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన వారు రావణాసుర పాలన సాగిస్తున్నారని అన్నారు. దేవుళ్ళను ఉపయోగించుకొని రాజకీయ క్రీడ సాగించాలని బిజేపి నాయకులు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో తిరుమలను ఉపయోగించుకొని రాజకీయం చేయాలని ప్రయత్నిస్తే సమర్ధవంతంగా తిప్పికొట్టామని, కానీ ప్రస్తుతం వీరి చూపు కేరళలోని అయ్యప్ప దేవాలయం విూద పడిందని మంత్రి కేఈ పేర్కొన్నారు. బీజేపీ నేతల కుట్రలను ప్రజలంతా ఏకమై తిప్పికొట్టాలని కేఈ పిలుపునిచ్చారు.
దేశంలోని వ్యవస్థలన్నీంటిని.. బీజేపీ బ్రష్టుపట్టించింది




