దేశానికి బలమైన పునాది వేసిన మహాత్మా గాంధీ
* మహనీయులను కించపరచడం తగదు
* గాడ్సే లను కీర్తించడం దుర్మార్గం
* మహానీయులను స్మరించుకోవడం నిజమైన నివాళి
* రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్, మంత్రి గంగుల
కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి ) :
దేశానికి బలమైన పునాదిని వేసిన జాతి పిత మహాత్మా గాంధీ అని, శాస్త్రీయ దృక్పథం నేర్పిన దేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అని, కానీ ఆ ఇద్దరు మహనీయులను కించపరుస్తూ కొన్ని శక్తులు సోషియల్ మీడియాలో దుష్ట ప్రచారం చేయడం తగదు అని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
మహాత్మా గాంధీని చంపిన గాడ్సే లను కీర్తిస్తూ సోషియల్ మీడియాలో పోస్టింగ్స్ దుర్మార్గం అని వినోద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారత దేశ వజ్రొత్సవ వేడుకల సందర్భంగా కరీంనగర్ నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో మంత్రి గంగుల కమలాకర్ తో కలిసి వినోద్ కుమార్ బుధవారం మొక్కలు నాటారు.
ఆ తరువాత మంత్రి కమలాకర్, జిల్లా యంత్రాంగం, ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రతిమా మల్టీ ఫ్లెక్స్ లో గాంధీ సినిమాను వీక్షించారు.
ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ ఎందరో మహానీయుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్రం లభించిందని అన్నారు.
దేశానికి స్వాతంత్రం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి కెసీఆర్ ఆదేశాల మేరకు 15 రోజుల పాటు తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో వజ్రోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నాం అని వినోద్ కుమార్ తెలిపారు.
అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహనీయుడు మహాత్మాగాంధీ అని వినోద్ కుమార్ కొనియాడారు.
మహాత్మా గాంధీ గురించిన శాంతియుత పోరాట పటిమ, పట్టుదల విద్యార్థులకు తెలియజెప్పేందుకు ఉచితంగా గాంధీ చిత్ర ప్రదర్శనను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
వజ్రోత్సవాలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రీడమ్ పార్క్ లను ఏర్పాటు చేసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు వినోద్ కుమార్ పేర్కొన్నారు.
ప్రతి ఇంటిపై జాతీయ పతాకాలను ఎగురవేసి జాతి సమైక్యత, స్ఫూర్తిని చాటాలని వినోద్ కుమార్ పిలుపునిచ్చారు.
గాంధీ సినిమాను వీక్షించిన వినోద్ కుమార్, గంగుల :
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్,
రాష్ట్ర బి సి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ , కలెక్టర్ కర్ణన్, పోలీసు కమిషనర్ సత్యనారాయణ, మేయర్ సునీల్ రావులతో కలసి గాంధీ చిత్రాన్ని బుధవారం కరీంనగర్ లోని ప్రతిమా మల్టీ ప్లెక్స్ లో వీక్షించారు.
ఈ సందర్బంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ జీవిత చరిత్రను ప్రతీ విద్యార్థి తెలుసుకోవాలని అన్నారు.
స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా పాఠశాల విద్యార్థుల కోసం గాంధీ చిత్ర ప్రదర్శన ఈ నెల 11 నుంచి 21 తేదీ వరకు కరీంనగర్ జిల్లాలోని 13 సినిమా థియేటర్లలో గాంధీ చిత్రాన్ని ప్రదర్శిస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపా రాణి, అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ , కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సేవా ఇస్లావత్, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.