హైదరాబాద్,ఫిబ్రవరి20:
తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా చెలరేగిన దొంగలు నగరంలోని సహారా ఎస్టేట్స్‌లో 10 ఇళ్లు దోచుకున్నారు. ఈ సంఘటన గురువారం రాత్రి వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సహారా ఎస్టేట్స్‌లో జరిగింది. గుర్తుతెలియని దుండగులు కాలనీలో తాళం వేసి ఉన్న 10 ఇళ్లకు రంధ్రాలు చేసి చోరీకి పాల్పడ్డారు. శుక్రవారం ఇది గమనించిన కాలనీవాసులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్
టీంల సహాయంతో ఆధారాల కోసం గాలిస్తున్నారు. కాగా, తాళం వేసి ఉన్న ఇంటి యజమానులు వస్తేనే ఎంత మొత్తంలో దొంగతనం జరిగిందో తెలుస్తుందని పోలీసులు చెప్పారు. స్థానికుల, పోలీసుల కథనం ప్రకారం… వనస్థలిపురం మన్సూరాబాద్ డివిజన్‌లోని సహారా ఎస్టేట్‌లో గురువారం రాత్రి దుండగులు ప్రహరీకి రంధ్రం వేసి లోపలికి చొరబడ్డారు. 3 అపార్ట్‌మెంట్లలోని ఆరు ఇళ్ల తలుపుల తాళాలు పగులకొట్టారు. చోరీలు జరిగిన ఇళ్లల్లో ఎవరూ లేకపోవటంతో ఎంత సొత్తు పోయిందనే వివరాలు పూర్తిగా తెలియలేదు. వనస్థలిపురం ఏసీపీ భాస్కర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




