Thursday, 5 November 2026

నాలుగేళ్లలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాం

– 24గంటల విద్యుత్‌ను అందిస్తున్నాం
– తెలంగాణ పాలన యావత్‌ దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది
– 17లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల గోదాములను నిర్మించాం
– దేశానికి తెలంగాణ రైతులను ఆదర్శంగా నిలపడమే కేసీఆర్‌ ధ్యేయం
– రాష్ట్ర మంత్రి కేటీఆర్‌
– మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిన వరంగల్‌ కాంగ్రెస్‌ నేతలు
హైదరాబాద్‌, మే9(జ‌నం సాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం అనంతరం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలోనే తెలంగాణను అభివృద్ధిపథంలో నడిపిస్తున్న ఘనత కేసీఆర్‌ది అని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్‌ హాజరై.. ఆ నేతలు, కార్యకర్తలకు టీఆర్‌ఎస్‌ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఈ చేరికలతో వరంగల్‌ పశ్చిమ నియోజవకర్గంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. నాలుగేళ్లలోనే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని జోడెద్దుల్లాగా ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. సమైక్య పాలనలో 6 గంటల కరెంట్‌ ఇవ్వడానికి ఆపసోపాలు పడ్డారు అని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల నాణ్యమైన కరెంట్‌ను ఇస్తున్నామని తెలిపారు. తెలంగాణ పాలన యావత్‌ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఉద్దేశ పూర్వకంగానే ఆనాడు ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు ఇరిగేషన్‌ ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని చెప్పారు. ఎరువులు, విత్తనాల కోసం గతంలో ఉన్న పరిస్థితులు లేవు. సకాలంలో నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందిస్తున్నామని తెలిపారు. నాలుగేళ్లలోనే 17 లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం ఉన్న గోదాములను నిర్మించుకున్నామని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. రైతులు పంటల సాగు సమయంలో పెట్టుబడికోసం వడ్డీవ్యాపారులు, బ్యాంకులు చుట్టూ తిరుగుతూ ఇబ్బందులకు గురవుతున్నారని, పంట సరిగా పండక వాటిని తీర్చలేక ఆత్మహత్యల పాలవుతున్నారని కేటీఆర్‌ అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని రైతులకు అండగా నిలిచేందుకే ఎకరానికి రూ.4వేల చొప్పున కేసీఆర్‌ పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నారని అన్నారు. పెట్టుబడి సాయంతో రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. పెట్టుబడి సాయం పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. తెలంగాణ రైతులను దేశానికే ఆదర్శంగా నిలిపేలా కేసీఆర్‌ ఓ ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని, దీనికి తెలంగాణ ప్రజానీకం అండగా నిలవాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వరంగల్‌ జిల్లా తెరాస నేతలు పాల్గొన్నారు.
——————————-