Thursday, 5 November 2026

నాసిరకం నిర్మాణాలతో ప్రజాధనం వృధా.

నాసిరకం నిర్మాణాలతో ప్రజాధనం వృధా.
– వారం రోజులకే బీటలు వారిన బీటి రోడ్డు.
– పిర్యాదు చేసిన పట్టించుకోని అధికారులు.
ఫొటో :బీటలు వారిన జంగాల్ పేట బీటి రోడ్డు.
బెల్లంపల్లి, జనవరి 14, (జనంసాక్షి )
నాసిరకం నిర్మాణాలతో ప్రజాధనం వృధా అవుతుంది. ఇలా నాసిరకంగా నిర్మించిన కాంట్రాక్టర్ ను మళ్ళీ ఇలాంటి తప్పులు చేయకుండా ఉండేలా బ్లాక్ లిస్టులో పెట్టాలని జంగాల్ పేట, మన్నెగూడెం పంచాయతీ పరిధిలోని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గత రెండేళ్లుగా తమ రోడ్డుకు మరమ్మత్తులు చేపట్టాలని, గతుకుల రోడ్డుపై ప్రయాణం నరకప్రాయంగా ఉందని అధికారులకు మొర పెట్టుకుంటే, ఈ సమస్యపై పలుమార్లు పత్రికల్లో కథనాలు వస్తే ఎట్టకేలకు స్పందించిన అధికారులు బీటి రోడ్డు మరమ్మత్తులకు నిధులు మంజూరు చేశారు. రోడ్డు మరమ్మత్తులకు నిధులు మంజూరైనప్పటికి వర్షాలు అధికంగా ఉన్నాయనే సాకుతో మూడు నెలల కాలం వృధాగా గడిపారు. తీరా రెండే రోజుల్లో రోడ్డు మరమ్మత్తుల పనులు నాసిరకంగా పూర్తి చేసి చేతులు దులుపుకున్నారు. రోడ్డు మరమ్మత్తులకు తీసుకోవాల్సిన కనీస నిబంధనలు పాటించకుండా కేవలం రెండే రోజుల్లో ఏ అధికారి పర్యవేక్షణ లేకుండా పనులు నిర్వహించారని ఆయా గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై సంబంధిత అధికారికి పిర్యాదు చేద్దామని ప్రయత్నిస్తే సదరు ఇంజనీర్ అధికారి ఆయా పంచాయతీల సర్పంచుల ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదని సర్పంచులు సైతం వాపోతున్నారు. నాసిరక రోడ్డు నిర్మాణానికి సహకరించిన అధికారిపై చర్యలు తీసుకొని, నాసిరకంగా రోడ్డు మరమ్మత్తులు పనులు చేపట్టిన కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆయా గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.