పంజాగుట్ట: నిమ్స్‌కు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి ఆయన నిమ్స్ ఆస్పత్రిని సందర్శించారు. రెండు గంటల పాటు వివిధ విభాగాల్లో తిరిగి సమస్యలను తెలుసుకున్నారు. పాతభవనంలోని కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ యూనిట్, డయాలసిస్ యూనిట్, ఎఫ్-బ్లాక్, న్యూరో సర్జరీ విభాగం ఐసీయూ తదితర విభాగాలను ఆయన సందర్శించారు. ఈ సం దర్భంగా రోగులు ఎదుర్కొనే సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అత్యవసర విభాగంలో మరుగు దొడ్లు సరిపోడం లేదని, అపరిశుభ్రంగా ఉన్నాయని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అత్యవసర విభాగం ఎదురుగా నాలుగు అంబులెన్స్‌లో రోగులు ఉండడా న్ని చూసిన మంత్రి వారిని పలుకరించగా.. తమకు వార్డులో బెడ్లు లేవని చేర్చుకోకపోవడంతో అంబులెన్స్‌లో ఉన్నామని రోగుల బంధువులు కన్నీటి పర్యంత అయ్యారు. దీంతో వైద్య అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులను వెనక్కు పంపించే దుస్థితికి తీసుకురావద్దని అధికారులను ఆదేశించారు. త్వరలో కొత్త భవనంలో సిటీ స్కాన్, ఎంఆర్‌ఐ యంత్రాలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఈయన వెంట వైద్యులు గంగాధర్, ఏఎంఎస్‌లు కృష్ణారెడ్డి, లక్ష్మీభాస్కర్, వివిధ విభాగాల వైద్యులు ఉన్నారు.




