Tuesday, 3 November 2026

నిమ్స్‌ ఆస్పత్రి వైద్యుడిపై దాడి

– ఓ ప్రముఖ నేత అనుచరుల హగామా
– ఆస్పత్రిలో ఉద్రిక్తత పరిస్థితి, పోలీస్‌ స్టేషన్‌లో కేసునమోదు
హైదరాబాద్‌, మే20(జ‌నంసాక్షి) : హైదరాబాద్‌ నిమ్స్‌ ఆసుపత్రిలో డాక్టర్లపై రోగి బంధువులు దాడి చేసిన ఘటన వివాదాస్పదంగా మారింది. ఎమర్జెన్సీ వార్డులో డాక్టర్‌పై ఏకంగా దాడిచేశారు. పోలీసుల సమక్షంలోనే వైద్య సిబ్బందిని నానా దుర్భాషలాడారు. ఆస్పత్రిలో నానా హంగామా చేశారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఓ వ్యక్తికి చికిత్స అందించడంలో నిమ్స్‌ వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వహించారని అతడి బంధువులు ఆరోపించారు. సోమవారం తెల్లవారుజామున 4 నుంచి 5 గంటల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుడి తలకు తీవ్ర గాయమై రక్తస్రావం అవుతుంటే.. వైద్య సిబ్బంది ఎవరూ పట్టించుకోలేదని బాధితుడి బంధులువు ఆరోపించారు. ఆస్పత్రికి తీసుకొచ్చిన 2 గంటల వరకూ బాధితుణ్ని పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యులపై దాడికి దిగడంతో నిమ్స్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఓ సీనియర్‌ వైద్యుడిని పట్టుకొని ‘నువ్వు అసలు మనిషివేనా..’ అంటూ బూతులు తిట్టి, దాడి చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆస్పత్రిలో హంగామా సృష్టించిన వారిలో మంత్రి తలసాని అనుచరులు ఉన్నట్లు సమాచారం. వైద్య సిబ్బందిపై దాడి చేస్తుండగా అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఆ దృశ్యాలను సెల్‌ ఫోన్లో చిత్రీకరించారు. ఈ వీడియో కాస్త సోషల్‌ విూడియాలో పోస్టు చేయడంతో వైరల్‌ అవుతోంది. మరోవైపు.. ఈ ఘటనపై నిమ్స్‌ సిబ్బంది ఆలస్యంగా స్పందించారు. సోమవారం మధ్యాహ్నం పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.