Wednesday, 4 November 2026

నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపించే దమ్ము టిఆర్ఎస్ పార్టీకి ఉందా

నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపించే దమ్ము టిఆర్ఎస్ పార్టీకి ఉందా.

 

మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్

సిరిసిల్లలో సెస్ ఎన్నికల సన్నాహక సమావేశం.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. నవంబర్ 22. (జనంసాక్షి). సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థ సెస్ ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించే దమ్ము మంత్రి కేటీఆర్ టిఆర్ఎస్ పార్టీకి ఉందా అని కరీంనగర్ మాజీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పొన్నం ప్రభాకర్ సూటిగా ప్రశ్నించారు. మంగళవారం సిరిసిల్లలో డిసిసి అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గౌడ్ అధ్యక్షతన సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థ సెస్ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పోన్నం ప్రభాకర్ మాట్లాడుతూ జిల్లాలోని రైతాంగం టిఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతుందనే ఉద్దేశంతోనే సెస్ ఎన్నికలను వాయిదా వేస్తూ వచ్చారని అన్నారు. రుణమాఫీ తో సహా రైతులకు ఉన్న అనేక సమస్యలను టిఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఆందోళనల ఫలితంగానే కోర్టు జోక్యం చేసుకొని ఎన్నికలు జరపాలని ప్రభుత్వానికి చురకలు వేసిందని అన్నారు. ఈ క్రమంలో జరుగుతున్న ఎన్నికల్లో గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అందరూ నాయకులను సమన్వయం చేస్తూ రైతుల పక్షాన నిలబతమని అన్నారు. రైతుల సహకారంతో ఎన్నికల్లో విజయం సాధిస్తామని తెలిపారు.. సాండ్, ల్యాండ్, లిక్కర్ మాఫియా తో అడ్డగోలుగా డబ్బులను ఖర్చు చేసి ఎన్నికల్లో గెలిచేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రలోభాలకు సిద్ధమవుతుందని అన్నారు. మంత్రి కేటీఆర్ కు దమ్ముంటే నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని సవాల్ చేశారు.. సెస్ లో అడ్డగోలుగా అవినీతి జరుగుతున్న ప్రస్తుత ఎంపీ బండి సంజయ్ కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని ఒక్క సమావేశానికి కూడా హాజరుకాకుండా పరోక్షంగా అక్రమాలు జరుగుతున్న ఉదాసీనంగా వ్యవహరించడం పై మండిపడ్డారు. రైతుల పక్షాన నిలబడి పోరాడేందుకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యచరణతో ముందుకు వెళుతుందని అన్నారు. రుణమాఫీ తో పాటు రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ఈనెల 24న రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఆందోళనలో కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి ఆది శ్రీనివాస్, సాగరం వెంకటస్వామి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, కుస రవీందర్. ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఆకునూరి బాలరాజు, బ్లాక్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సూర దేవరాజు, అన్ని మండలాల అధ్యక్షులు కార్యదర్శులతో పాటు ముఖ్య నాయకులు పాల్గొన్నారు