నేటి నుంచి ప్రారంభం కానున్న బుగ్గ రామలింగేశ్వర స్వామి

రంగారెడ్డి,ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):-  మంచాల మండలం ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఉత్సవాలకు ఆలయ నిర్వాహకులు సర్వం సిద్ధం చేశారు. కార్తీక పౌర్ణమి నుండి ప్రారంభమై ఈ నెల 23 వరకు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి.  రాష్ట్రంలో 15 రోజుల పాటు నిర్విరామంగా జరిగే అతిపెద్ద జాతర ఇదే కావడం గమనార్హం.  ఉత్సవాల కోసం ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఉత్సవాల నిర్వహణ కమిటీ, ప్రజాప్రతినిధులు, అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎంతో మహిమాన్విత మైన ఈ ఆలయానికి పురాతన చరిత్ర ఉంది. కోరిన కోరికలు కొంగు బంగారంగా నిలుస్తున్న రామలింగేశ్వర ఆలయానికి గొప్ప చరిత్ర ఉందని అక్కడి ప్రాంత ప్రజల అభిప్రాయం. పూర్వం రాముడు ఇక్కడ శివ లింగాన్ని నెలకొల్పి పూజించినట్టుగా పెద్దలు తరతరాలుగా చెప్తున్నారు. తర్వాత ఇక్కడ నీటి గుండంలో చిన్న నీటి బుడగ పుట్టిందని, ఏ కాలంలో అయినా ఎంత కరువొచ్చిన ఇక్కడ స్వచ్ఛమైన నీరు ఉబికి వస్తుంది. 14 వ శతాబ్దంలో రాచకొండ రాజులు రేచర్ల పద్మనాయక వంశస్తుల పరిపాలనలో ఈ బుగ్గ రామలింగేశ్వర స్వామి పూజలందుకున్నట్టు ప్రతీతి. నాటి నుండి నేటి వరకు ప్రతీ సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజు రాత్రి నుంచి ఇక్కడ కార్తీక స్నానమాచరిస్తారు. ఎముకలు కొరికే చలిని కూడా లెక్క చేయకుండా భక్తులు ఇక్కడి నీటి గుండంలో స్నానాలు చేస్తారు. చాలా మంది భక్తులు స్వామి సన్నిధిలో ఒక రాత్రి నిద్ర చేసి మరుసటి రోజు స్వామి దర్శన అనంతరం కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేసుకొని అందమైన అడవిలో ఆనందంగా గడుపుతారు. స్వామి ఆలయం పక్కనే కబీర్ దాస్ మందిరం ఉన్నది . దీనిని హైదరాబాద్కు చెందిన నర్సింహ బాబా అనే భక్తుడు కాశీలో ఉపదేశం పొంది 1975లో ఇక్కడ కబీర్ దాస్ ఆలయాన్ని నిర్మించి ఇక్కడే సజీవ సమాధి -అయ్యారు. కబీర్ దాస్ ఆలయానికి ఎదురుగా పెద్ద పుట్టతో ఉన్న నాగదేవత ఆలయం ఉన్నది. ఇక్కడ మహిళలు పెద్ద ఎత్తున నాగదేవత పుట్టలో పాలు పోసి పూజిస్తారు. ఈ ఆలయానికి స్థానిక భక్తులే కాక తెలంగాణ రాష్ట్ర తో పాటు ఆంధ్ర రాష్ట్రాల భక్తులు వచ్చి స్వామిని దర్శించుకుంటారు. ఇక్కడ గుండంలోకి తూర్పు దిక్కు నుండి నీరువచ్చి మళ్లీ పడమరకు దిక్కున కొద్ది దూరం పారుతూ పోయి మళ్ళీ తూర్పుకు మళ్లీ ఆ నీళ్ళు బండ రాళ్లలోకి పోతాయి. కార్తీక పౌర్ణమి నాడు ప్రారంభమైన ఉత్సవాలకు ప్రభుత్వం ప్రత్యేకంగా రవాణా సౌకర్యాలు కల్పింస్థాయి ఇబ్రహీంపట్నం డిపో నుండి ప్రత్యేకంగా బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర పేరుతో ఆర్టీసీ బస్సులు నడుపుతారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ నుండి ఆర్టీసీ బస్సులు నడుపనున్నారు.
జాతర ఏర్పాట్లు పూర్తి   సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్ రెడ్డి.
 బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 8 నుంచి 23 వరకు జరిగే బుగ్గ జాతరకు  ఏర్పాట్లు పూర్తయినట్లు సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. మొదటి రోజు 20 వేలపై చిలుకు మందిభక్తులు వస్తారని అంచనా వేసి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఇబ్రహీంపట్నం బస్టాండ్ నుంచి ప్రత్యేకబస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. మొదటి రోజు ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలుచేసి ఉత్సవాలు ప్రారంభించనున్నారు.