పెద్దేముల్ ఆగస్టు 21 (జనం సాక్షి)
వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలోని తట్టేపల్లి అటవీ ప్రాంతంలో వెలిసిన
అంబురామేశ్వర ఆలయంలో ప్రతి ఏటా శ్రావణమాసం ఆఖరి సోమవారం ఉత్సవాలు జరుగుతాయి. సోమవారం అనగా తేదీ 22 ఆగస్టు 2022 అంబురామేశ్వర జాతర ఉత్సవాలు జరుగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మండలంలోని తట్టేపల్లి, పాషాపూర్ గ్రామాల మధ్యలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో అంబురామేశ్వరాలయం వెలసింది.ప్రతి సంవత్సరం శ్రావణమాసం ఆఖరి సోమవారం రోజు అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు.ప్రతి సంవత్సరం ఈ జాతర ఉత్సవాలకు తాండూర్, వికారాబాద్, హైదరాబాద్, కర్ణాటక రాష్ట్రం నుండి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి స్వామి వారిని దర్శనం చేసుకుంటారు. తాండూరు నుండి జహీరాబాద్ వెళ్లే బస్సుల ద్వారా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. ఆలయానికి త్రేతా యుగం నాటి చరిత్ర గలదు. త్రేతా యుగంలో శ్రీరామచంద్రుడు అడవి మార్గంలో వెళ్తుండగా ఇక్కడే సేద తీరగా అప్పుడు శ్రీరామచంద్రుడికి దాహం వేయడంతో బాణంతో గంగను పైకి తెప్పించాడని,అక్కడే శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు నిరవహించినట్లు నానుడి.ఈ ఉత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు కల్పిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు వీరేశం తెలిపారు. ఈ జాతర మహోత్సవాలకు పోలీసు బందోబస్తు కల్పిస్తామని పెద్దేముల్ ఎస్సై రవూఫ్ పేర్కొన్నారు.




