ఊరూవాడ సంబరాలకు సిద్దం
నేటితో ముగియననున్న బతుకమ్మ వేడుకలు
హైదరాబాద్ సహా పట్టణాల్లో పత్రేక ఏర్పాట్లు
హైదరాబాద్,అక్టోబర్5 (జనంసాక్షి): తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన బతుకమ్మ పండగ తుది అంకానికి చేరింది. ఆదివారం సద్దుల బతుకమ్మతో పండగ ముగియనుంది. ఊరూవాడా వారం రోజులుగా బతుకమ్మ పండగ జోరుగా సాగుతోంది. ఆడపడుచుల రాకతో గ్రామాలు కళకళలాడుతున్నాయి. ఆదివారం జరిగే సద్దుల బతుకమ్మ వేడుకలుకు పల్లెలు మొదలు పట్టణాల వరకు ముస్తాబయ్యాయి. మైదరాబాద్లో ప్రత్యేకంగా బతుకమ్మను నిర్వహిస్తున్నారు. సిద్దిపేట, వరగంల్ తదితర పట్టణాల్లో వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ప్రకృతి రమణీ యకతకు బతుకమ్మ నిదర్శనం. ఆశ్వయుజ మాసం శుద్ధ పాఢ్యమి నుంచి తొమ్మిది రోజుల పాటు బతుకమ్మను వేడుకగా జరుపుకుంటారు. రంగురంగుల పూ ను త్రికోణాకృతిలో పేర్చి, అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు కొడుతూ..ఆడి, పాడతారు. అప్పుడు మహిళలు పాడే పాటలు మనసుకు హత్తుకుంటాయి. ఏరోజు ప్రత్యేకత ఆ రోజుదే. ఇలా తొమ్మిది రోజులు ఆడిన బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేసి, నైవేద్యంగా పెట్టిన ప్రసాదాన్ని ఆడపడుచులంతా పంచుకుంటారు. తొమ్మిదో రోజు వేడుకగా సద్దుల బతుకమ్మను నిర్వహించి గౌరీదేవిని సాగనంపుతారు. ఇదో రకంగా గౌరీపూజను చేయడం.. అమ్మవారికి దసరా ముందు శరన్నవరాత్రులు ఎలా జరుపుతామో తెలంగాణాలో 9రోజులపాటు బతుకమ్మ వేడుకలను అలా జరుపడం ఆనవాయితీ. ఈ 9 రోజుల్లో కూడా తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి మహిళలంతా గుమిగూడా ఆడుకోవడం…ఆడపిల్లలను ఇంటికి రప్పించి వేడుక
చేయడం పెద్ద సరదా. రంగురంగుల పుష్ప సౌందర్యాల హంగులతో సింగారించుకొనే బంగరు కల్పవల్లిగా బతుకమ్మను తెలంగాణవాసులు భావిస్తారు. ఓ పళ్లెంలో గుమ్మడి ఆకులు పరచి, వాటిని పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. ముందుగా గుమ్మడి పువ్వుల్ని అమర్చి- అక్కడే తంగేడు, బీర, గన్నేరు, నిత్య మల్లె, బంతి వంటి పుష్పాల్నిపేర్చి కూర్చడం కళాత్మకంగా చేస్తారు. అదే పువ్వుల దొంతరపై తమలపాకులో పసుపు గౌరమ్మను అలంకరిస్తారు. ఆ పుష్ప సముదాయాన్నే బతుకమ్మగా వ్యవహరిస్తారు. మహిళలు లయాత్మకంగా అడుగులు వేస్తూ, చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. బతుకమ్మ ఆవిర్భావం, గౌరీదేవి లీలలు, సామాజిక జీవన రీతులు, కుటుంబాల అనుబంధాలు, పురాణగాథలు, ఇతిహాస ఘట్టాల్ని వారు పాటల రూపంలో ఆలపిస్తారు. పసుపుబొట్టు పేరిట తాంబూలాలు ఇచ్చి పుచ్చుకొంటారు. బతుకమ్మను పసుపు, కుంకుమలతో ఆరాధించి వివిధ రకాల పదార్థాల్ని నివేదన చేస్తారు. ఆటపాటల అనంతరం, ప్రతి నిత్యం జలాశయాల్లో నిమజ్జనం చేయడం ఈ సంప్రదాయంలో ఒక భాగం. ప్రకృతి స్వరూపిణిగా అమ్మవారిని భావించి, వివిధ పుష్పాలతో పేర్చి ‘బతుకమ్మ’గా ఆరాధిస్తారు. మహాలయ అమావాస్య నుంచి మహర్నవమి వరకు సాగే ఈ ఉత్సవం తెలంగాణ సాంస్కృతిక సౌరభాల్ని వెదజల్లుతుంది.అందుకే మన జీవన విధానం, సామాజిక ఏకత్వానికి మన పండుగలు ప్రతీకలుగా నిలుస్తున్నాయి. తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన బతుకమ్మ పండగలో ప్రకృతి ఆరాధనతో పాటు కుటుంబ కట్టుబాటు, ఆచారాలు ఇమిడి ఉన్నాయి. ఆటపాటల నేపథ్యంగా, నిత్య జీవన రీతికి అనుగుణంగా ఈ సంబరాల్ని కొనసాగిస్తారు. సకల ప్రాణులకూ జీవశక్తిని అందజేసే ప్రకృతి, ఆకృతి- బతుకమ్మ. తొమ్మిది రోజులపాటు బతుకమ్మ సందడి విలసిల్లుతుంది. పూర్ణత్వానికి సంకేతం- తొమ్మిది. నవ విధ భక్తి మార్గాలకు, నవ నిధులకు ప్రతిబింబంగా బతుకమ్మను తొమ్మిది రకాల పుష్పాలతో తొమ్మిది వరసల్లో అమరుస్తారు. తొమ్మిది రోజులూ గౌరీదేవి ‘పూలమ్మ’గా పుట్టింటికి తరలి వచ్చినట్లు భావిస్తారు. తమ ఇంటి ఆడబిడ్డగా బతుకమ్మను భావిస్తూ, ఆరాధన చేస్తారు. తొమ్మిదో రోజున సద్దుల బతుకమ్మకు సాగనంపు వేడుక నిర్వహిస్తారు. గౌరమ్మను అత్తవారింటికి- అంటే, శివుడి వద్దకు పంపుతూ, సకల సౌభాగ్యాలూ అనుగ్రహించడానికి మళ్లీ తరలిరమ్మని వేడుకుంటారు. చివరికి ఆ ప్రకృతిలోనే మమేకమవుతుంది. పూలతో బతుకమ్మ ఆవిర్భవించడం, ఆటపాటలతో అలరింతగా వేడుక చేయడం, నిమజ్జనంతో అనంత ప్రకృతిలో సంలీనం కావడం అనేవి- జగన్మాత సృష్టి, స్థితి, లయాత్మక తత్వాలకు సంకేతాలుగా భావించాలి.
నేడు సద్దుల బతుకమ్మ వేడుకలు




