Monday, 2 November 2026

నేడు సాహిత్య శిరోమణి పురస్కారాల ప్రదానం

పంజాగుట్ట : తెలుగు భాషాభివృద్ధికి విశేష సేవలు చేసిన ప్రముఖ రచయితలకు తెలుగు భాష దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత్‌ కల్చరల్‌ అకాడమీ, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్రభారతిలో సాహిత్య శిరోమణి పురస్కారాలను అందజేయనున్నారు. మధురానగర్‌లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో భారత్‌ కల్చరల్‌ అకాడమీ అధ్యక్షుడు, ప్రముఖ దర్శక నిర్మాత నాగబాల సురేశ్‌కుమార్‌ వివరాలు వెల్లడించారు. సినిమా, టి.వి, రంగస్థలంతో పాటు వివిధ రంగాలలో పేరుగాంచిన ప్రముఖ రచయితలకు సాహిత్య శిరోమణి పురస్కారాలను అందజేయనున్నట్లు తెలిపారు. పురస్కారాలు అందుకోనున్న వారిలో తోటపల్లి సాయినాథ్‌, డాక్టర్‌ వడ్డేపల్లి కృష్ణ, డాక్టర్‌ వెనిగల్ల రాంబాబు, రాజేంద్రరాజు, శ్రీశైల మూర్తి, ఉషారాణి, సాయిమాధవ్‌, ఉదయ్‌ భాగవతుల, దీపిక ప్రసాద్‌, మడిపల్లి భద్రయ్య, డి.వెంకటేశ్వర్లు, కరీంనగర్‌ శర్మ, కాకినాడ, ప్రసాద్‌, ఈఎల్‌ఎన్‌ఎస్‌ ప్రసాద్‌, పల్నాటి పాంచజన్యం, తోకల రాజేశ్‌, మేస్రం మనోహర్‌, శ్రీధర్‌ బీచరాజు, మడిపల్లి దక్షిణమూర్తి, మఽదన్‌ దీక్షిత్‌ ఉన్నారు. మహాకవి కాళోజీ నారాయణరావు, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ లఘు చిత్రాల ఆవిష్కరణ, తాను రచించిన రేబిస్‌ అండ్‌ మార్చ్‌ ఫాస్ట్‌ నాటికల పుస్తక ఆవిష్కరణ, దాశరథి అవార్డు గ్రహీత డాక్టర్‌ తిరుమల శ్రీనివాసాచార్యులు రాసిన రత్నం కోసం యత్నం రుబాయిలు ఆవిష్కరణ, అంకితోత్సవం తదితర కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమం సాయంత్రం 6 గంటలకు ఉంటుందని, ఇందులో రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సాంస్కృతిక సారధి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, ఎమ్మెల్యే కోవా లక్ష్మీ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు హరికృష్ణ, శ్రీవెంకటేశ్వర భక్తి చానల్‌ సీఈవో పి.మధుసూదన్‌ రావు, పలువురు ప్రముఖులు పాల్గొంటారన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *