కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సీఎం కేసీఆర్ గురువారం మధ్యాహ్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ”కమాండ్ కంట్రోల్ కేంద్రం రూపకర్త డీజీపీ మహేందర్‌రెడ్డి. దీని నిర్మాణానికి ఆయన ఎంతో శ్రమించారు. ఆర్‌అండ్‌బీ కృషి కూడా ఉంది. లక్ష్య సాధనలో కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి. చిత్తు శుద్ధి, వాక్‌శుద్ధి, సందర్భ శుద్ధి ఉంటే అనుకున్న లక్ష్యాలు అన్నీ నెరవేరుతాయి. ఈ విషయంలో రాష్ట్ర పోలీసుశాఖకు హృదయపూర్వక అభినందనలు. రాష్ట్రంలో ఎక్కడ విపత్తు తలెత్తినా పోలీసుశాఖ ముందుంటుంది. ఉత్తమ పోలీసు వ్యవస్థ ఉంటే సమాజం బాగుంటుంది. హైదరాబాద్‌లో నేరాలు తగ్గాయి. సమాజ హితం కోసం సంస్కరణలు తీసుకొస్తున్న పోలీసులకు సెల్యూట్. నేరాలు చేసే విధానంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. పోలీసు వ్యవస్థ ఎప్పటికప్పుడు అప్‌డేట్ కావాలి. అత్యధిక శక్తిమంత దేశమైన అమెరికా అమలు చేస్తున్న విధానాలను అనుసరించే విధంగా ప్రణాళిక రూపొందిస్తాం. పోలీస్ శాఖకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుంది” అని సీఎం అన్నారు.
మహేందర్ రెడ్డి సేవలను మరో రూపంలో వినియోగించుకుంటాం..
”సైబర్ నేరాలు సమాజాన్ని పట్టిపీడిస్తున్నాయి. డీజీ స్థాయి అధికారి పర్యవేక్షణలో సైబర్ నేరాలపై దృష్టి సారించాలి. సైబర్ నేరాల నిరోధానికి డీజీ లేదా అదనపు డీజీ స్థాయి అధికారికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలని ఇప్పటికే డీజీపీకి సూచించా. భవిష్యత్ తరాల బంగారు భవితను డ్రగ్స్ నాశనం చేస్తోంది. దాన్ని అణిచివేసేందుకు పోలీస్ శాఖ ఇతర శాఖలతో సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లేలా ప్రణాళిక రూపొందించాం. నేరాలను నియంత్రించేందుకు పోలీసుశాఖ ప్రధాన పాత్ర పోషించాలి. భారత దేశానికే తెలంగాణ పోలీస్‌శాఖ ఆదర్శంగా నిలవాలి. ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ ఏర్పడాలనేదే నా అభిమతం. కమాండ్ కంట్రోల్ సెంటర్ వస్తుందని ఎవరూ ఊహించలేదు. కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని మరింత ఉన్నతంగా తీర్చి దిద్దేందుకు విశ్రాంత డీజీపీల సలహాలు, సూచనలు తీసుకుంటాం. మైనార్టీల సంక్షేమం కోసం ఏకే ఖాన్ అద్భుతంగా పనిచేస్తున్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డి డిసెంబర్‌లో పదవీవిరమణ చేస్తున్నారు. ఆయన సేవలను మరో రూపంలో వినియోగించుకుంటాం” అని కేసీఆర్ తెలిపారు.
రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహబూద్ అలీ, వేముల ప్రశాంత్‌రెడ్డి, మల్లారెడ్డి, సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం సీఎం కేసీఆర్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో కలియతిరిగారు. పోలీసు ఉన్నతాధికారులను అడిగి విశేషాలు తెలుసుకున్నారు. సుమారు రూ.600 కోట్లతో నిర్మించిన కమాండ్ కంట్రోల్ కేంద్రం.. పోలీసు విభాగానికి మూడో నిఘా నేత్రంగా పనిచేయనుంది. రాష్ట్రంలోని సీసీ కెమెరాలను కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేశారు. ఒకేసారి సుమారు లక్ష కెమెరాలు వీక్షించేలా కమాండ్ కంట్రోల్ కేంద్రంలో బాహుబలి తెరను ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు షిఫ్టుల వారీగా సిబ్బంది పని చేయనున్నారు. సీసీ దృశ్యాలు నిక్షిప్తం చేసేందుకు భారీ సర్వర్లు ఏర్పాటు చేశారు.












