Wednesday, 4 November 2026

నోట్ల కట్టలకు కమాన్‌పూర్‌ వాసులు లొంగలే…! – జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్‌

 

 

 

 

 

 

 

జనం సాక్షి, కమాన్ పూర్ : ఎన్నికలు వస్తే కాంగ్రెస్‌ పార్టీని ఏ విధంగా భూస్థాపితం చేయాలని చూసిన కమాన్‌పూర్‌ ప్రజలు నోట్ల కట్టలకు లొంగలేదని బీఆర్‌ఎస్‌పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అన్నారు. కమాన్‌పూర్‌ మండలం ఆదివరహస్వామి ఆలయ ఆవరణలో జరిగిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ తో కలిసి పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. కమాన్‌పూర్‌ మండలం అంటేనే ఒక స్పూర్తి అని కొనియాడారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ నోట్ల కట్టలతో అన్ని మండలాలకు వస్తే ఒక్క కమాన్‌పూర్‌ మండలం మాత్రమే మెజార్టీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. 2014 ఎన్నికల్లో ఉమ్మడి కమాన్‌పూర్‌ మండలం 6వేల మెజార్టీ ఇవ్వగా విభజన తర్వాత 2018లో కమాన్‌పూర్‌ మండలం 1900 మెజార్టీ ఇచ్చిందన్నారు. మండలంలోని కమాన్‌పూర్‌టౌన్‌, గుండారం మినహా మిగతా గ్రామాలన్నీ కాంగ్రస్‌కే ఓట్లు వేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కమాన్‌పూర్‌ నుంచి ఆదర్శనగర్‌ వరకు మంత్రిగా పనిచేసిన శ్రీధర్‌బాబు ఏం చేశాడో గమనించాలన్నారు. అవగాహన లేకుండా ఎంతోమంది ప్రజలు కాంగ్రెస్‌ మాయమాటలకు మోసపోయి ఓట్లు వేస్తున్నారని ఆయన అన్నారు. మంత్రిగా ఉన్న శ్రీధర్‌బాబు ఆనాడు ఎల్లంపల్లి నుంచి టూ టీఎంసీ నీళ్లకు ముత్తారంకు తీసుకెళ్లాడే కానీ మధ్యలో ఉన్న కమాన్‌పూర్‌ మండలానికి చుక్కనీళ్లు ఇవ్వలేదని, నీటి ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోలేదని ఆయన గుర్తు చేశారు.కానీ తాను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఎల్లంపల్లినుంచి టూ టీఎంసీ పైపులైన్‌ ద్వారా రాణాపూర్‌, నాగారం, పేరపల్లి గ్రామాలకు సాగునీరు అందించానని ఇలాంటి విషయాలపై కార్యకర్తలు చర్చ పెట్టాల్సిన అవసం ఉందన్నారు. అనవసరపు విషయాలపై చర్చ పెట్టే నాయకులు, కార్యకర్తలు పార్టీ బలోపేతానికి పనికి వచ్చేలా చర్చించాలన్నారు. కాటారం మండలంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్‌పార్టీకే మెజార్టీ ఇస్తారని, ధన్వాడ ప్రజలు సైతం కాంగ్రెస్‌కే ఓట్లు వేస్తారని, అసలు కాటారం మండలానికి ఎమ్మెల్యే కుటుంబం ఏం చేసిందో ఆలోచన చేయాలన్నారు. ఎలాంటి అభివృద్ది చేయని ఎమ్మెల్యే కుటుంబానికి ఓట్లు వేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీలో పుట్టిన వాళ్లు ఎంతో మంది ఉన్నారని, టీడీపీ పార్టీని పుట్టించిన వాళ్లు ఉన్నారని, అయితే ఎమ్మెల్యే కుటుంబం ఎన్నోకుట్రలు, కుతంత్రాలు చేసి నాయకులకు ఎలాంటి పదవులు ఇవ్వకుండా వారి ఎదుగుదలను అడ్డుకున్నారని ఆయన వివరించారు. కార్యకర్తలు కలిసి కట్టుగా పనిచేసి కసాయి కుటుంబాన్ని తరిమికొట్టాలన్నారు. చెంచెడు నీళ్లుపోయని, పైసా సాయం చేయని కుటుంబం నుంచి విముక్తి చేయాలనే ఆరాటంతో పోరాటం చేస్తున్నానని ఆయన అన్నారు. ఒకవైపు దేశం గర్వించే విధంగా సీఎం కేసీఆర్‌ సంక్షేమ పథకాలు అమలుచేస్తూ ప్రజల్లో విశ్వాసం పొందుటుంటే ఇక్కడ మాత్రం పార్టీని విచ్చిన్నం చేయాలనే స్వంత పార్టీ నాయకులు కుట్రలు చేస్తున్నారని ఆన్నారు. నియోజకవర్గ ఇంచార్జీ బాధ్యతలు అప్పగించిన నాయకుడిని విస్మరిస్తూ పార్టీలో విభేధాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి కుట్రలను కార్యకర్తలు పట్టించుకోవద్దని, పార్టీని నిలబెట్టేలా పనిచేయాలన్నారు. ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంతో కార్యకర్తలు సమిష్టిగా పనిచేస్తూ పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.