Friday, 6 November 2026

పసుపుకు మద్దతు ధర కల్పించాలి

– ఎంపీ కవిత
హైదరాబాద్‌, జూన్‌18(జ‌నం సాక్షి) : పసుపు పంటకు మద్దతు ధర కల్పించాలని టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పసుపు పంటపై బేగంపేటలో సోమవారం భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో స్పైస్‌ బోర్డు ఆఫ్‌ ఇండియా నిర్వహించిన ప్రత్యేక వర్క్‌షాప్‌లో ఎంపీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడారు. పసుపు రైతులను ఆదుకునేందుకు ఈ వర్క్‌షాప్‌ జరుగుతుందన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని 3 దశాబ్దాల నుంచి కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తున్నామని తెలిపారు. 1990లో 7 లక్షల మెట్రిక్‌ టన్నుల పసుపు ఉత్పత్తి అయ్యేదని, ఇప్పుడు 3లక్షల మెట్రిక్‌ టన్నులకు తగ్గిపోయిందన్నారు.  ఈ కారణాలపై వర్క్‌షాప్‌లో చర్చిస్తామని, పరిష్కారం చూపుతారని కవిత పేర్కొన్నారు. సోనాలిక పసుపు వంగడంకు బాగా డిమాండ్‌ ఉందన్నారు. తెలంగాణలో ఇతర పంటలకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయడం వల్ల రైతులకు మేలు జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు. నిజామాబాద్‌లో స్పైస్‌ బోర్డును ఏర్పాటు చేయాలని ఎంపీ కవిత డిమాండ్‌ చేశారు. ఈ వర్క్‌ షాపులో మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌ ప్రశాంత్‌రెడ్డి, పలువురు ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులు, స్పైస్‌ బోర్డు కొచ్చి డైరెక్టర్‌ డా క్టర్‌ సురేశ్‌ కుమార్‌, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ పార్థసారథి, తెలంగాణలోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీల అధ్యక్షులు ఈ వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు.