పాక్‌లో షియాలపైమళ్ళీదాడులు :ఏడుగురు మృతి

ఇస్లామాబాద్‌: మొహర్రమ్‌ నెల సందర్భంగా షియాలు లక్ష్యంగా పాకిస్తాన్‌లో జరుగుతన్న దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా శనివారం పాక్‌ వాయువ్యప్రాంతంలోని డేరా ఇస్మాయిల్‌ఖాన్‌ పట్టణంలో జరిగిన దాడిలో ఏడుగురు చనిపోగా, 18 మంది గాయపడ్డారు. ఒక ఇమాంబాడా పక్కన చెత్తకుండీలో అమర్చిన  బాంబును ఆ పక్కగా మొహర్రము ఊరేగింపు వెళుతుండగా ఉగ్రవాదులు పేల్చారు. మృతులలో నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. బాంబులు 10కిలోల పేలుడు పదార్థాలు, బాల్‌బేరింగులు ఉన్నాయని పోలీసులు చెప్పారు. పేలుడు ధాటికి చుట్టుపక్కల ఉన్నపలు ఇళ్ళు కూడా దెబ్బతిన్నాయి.
తీవ్రవాదుల దాడులను ఆరికట్టడం లక్ష్యంగా, పలు పట్టణాలు, నగరాలలో మొబైల్‌ ఫోన్‌ సర్వీసులను నిలిపివేయడం, ద్విచక్రవాహనాల వెనుక సీట్‌పై కూర్చోవడాన్ని నిషేధించడం వంటి చర్యలను హోంమంత్రి రెహమాన్‌ మాలిక్‌ అమలు చేస్తున్నప్పటికీ ఉపయోగంలేకుండా పోతోంది. షియాల ఊరేగింపులపై గస్తీకోసం ఇస్లామాబాద్‌లో పోలీసులు హెలికాప్టర్‌లను ఉపయోగిస్తున్నారు. బుధవారం అర్థరాత్రి రావల్పిండి, కరాచీ నగరాలలో జరిగిన  దాడులలో 23 మంది చనిపోయిన సంగతి తెలిసిందే.