పాపన్న వీరత్వానికి, పరాక్రమానికి ప్రతీక
-ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి
కరీంనగర్ టౌన్, ఆగస్టు 18(జనం సాక్షి):
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి ప్రతీక అని ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి కొనియాడారు.
సబ్బండ వర్గాల ఆత్మగౌరవ స్ఫూర్తిగా నిలిచిన సర్వాయి పాపన్న వీరగాధను, పాపన్న జయంతి సందర్భంగా కరీంనగర్ లోని పార్టీ కార్యాలయంలో గురువారం సర్వాయి పాపన్న గౌడ్ ను జోజిరెడ్డి స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాటి సమాజంలో నెలకొన్న నిరంకుశ రాజరిక పోకడలకు వ్యతిరేకంగా సబ్బండ వర్గాలను ఏకం చేసి, పాపన్న పోరాడిన తీరు గొప్పదని అన్నారు. సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఆయన వీరత్వాన్ని, పోరాట ప్రతిమను ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
బడుగు బలహీన వర్గాల నాయకత్వాన్ని సముచితంగా గౌరవించుకోవాలని అన్నారు. అణచివేత, వివక్షకు వ్యతిరేకంగా పాపన్న గౌడ్ ప్రదర్శించిన ఆత్మగౌరవ పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ ముందుకుపోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ర్ట నాయకులు కామ్రేడ్ సారంగపాణి, నాయిని నర్సయ్య, అల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ పులిమాటి సంతోష్ కుమార్, పెద్దెళ్లి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.