Tuesday, 3 November 2026

పాలేరులో పోటీ చేయం: రమణ

హైదరాబాద్ : ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికకు తెలుగుదేశం పార్టీ దూరంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చింది. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి మృతితో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే… అధికార టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే తమ అభ్యర్ధిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఎంపిక చేయగా… కాంగ్రెస్ పార్టీ మాత్రం దివంగత ఎమ్మెల్యే భార్య సుచరితారెడ్డిని ఎంపిక చేసింది. కాగా… సంప్రదాయాన్ని గౌరవించి కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వాలని టి.పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన అభ్యర్ధన మేరకు ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్ధిని నిలబెట్టకుండా కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. కాగా… తొలుత టీడీపీ అభ్యర్ధిగా మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావును పోటీలోకి దించాలని ఆపార్టీ నాయకులు భావించారు. అయితే… కాంగ్రెస్ నేతల విజ్ఞప్తి మేరకు అభ్యర్ధిని బరిలో దించకుండా ఉండి కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వాలనే నిర్ణయానికి వచ్చారు. ఇదే విషయాన్ని టీ.టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి తదితరులు మరికొద్దిసేపట్లో అధికారికంగా వెల్లడించనున్నారని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *