పోటీకే సిద్దమంటున్న టిడిపి,లెఫ్ట్
హైదరాబాద్,ఏప్రిల్22 : ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ ప్రతీష్టాత్మకంగా తీసుకుంది. మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయ కేతనం ఎగురవేసింది. ఈ పరాభవంతో సిట్టింగ్ స్థానం ఏకగ్రీవం ఓసం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో కనీసం మిగతా పార్టీల మద్దతుతో గెలవాలని చూస్తోంది. అయితే టిడిపి,సిపిఎం పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో పాలేరు ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పావులు కదుపుతున్నారు. అందులోభాగంగా టీడీపీ, వామపక్ష పార్టీలను ఒకే తాటిపైకి తీసుకువచ్చేందుకు తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రంగంలోకి దిగారు. ఆ క్రమంలో శుక్రవారం టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణకు ఉత్తమ్ కుమార్ ఫోన్ చేశారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కుమద్దతు ఇచ్చే విషయమై చర్చించారు. ఇక్కడ టిడిపి ఇప్పటికే మాజీ ఎంపి నామా నాగేశ్వరరావును ప్రకటించింది. దీంతో సిట్టింగ్ స్థానంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరినట్లు సమాచారం. ఈ ఉప ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. అందుకు వెంటనే నిర్ణయం చెప్పలేమని.. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబుతో సంప్రదించి.. చెబుతానని చెప్పారు. అయితే పాలేరులో గెలుపు మాదే అని ఇప్పటికే తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పార్టీలన్నీ ఏకమైనా టీఆర్‌ఎస్ విజయాన్ని అడ్డుకోలేవని మంత్రి తుమ్మలతో భేటీ అనంతరం కేటీఆర్ విలేకర్ల సమావేశంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక విషయమై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క చేసిన యత్నం ఫలించలేదు. టీఆర్‌ఎస్, టీడీపీలు తమ అభ్యర్థులను నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తుండటంతో భట్టి విక్రమార్క శుక్రవారం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో భేటీ అయ్యారు. తమ పార్టీ అభ్యర్థికి మద్దతివ్వాలని కోరారు. అయితే, అన్ని పార్టీలు ఎవరికి వారు అభ్యర్థులను ప్రకటిస్తున్న నేపథ్యంలో మద్దతివ్వటం సాధ్యం కాదని, తాము కూడా అభ్యర్థిని బరిలోకి దించుతామని ఆయన తేల్చినట్లు సమాచారం. దీంతో భట్టివిక్రమార్క వెనుదిరిగి వెళ్లిపోయారు. ఈ ఇద్దరి ప్రయత్నాలు దాదాపు విఫలం కావడంతో పాలేరులో ఇక బహుముఖ పోటీ తప్పేలా లేదు. దీంతో టిఆర్‌ఎస్‌కు లాభించగలదని భావిస్తున్నారు.




