హైదారబాద్,మార్చి3(జనంసాక్షి): తెలంగాణ పిసిసి అధ్యక్షుడు గా మాజీ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి నియామకంపై తొలి నిరసన నమోదయ్యింది. మరో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ నియామకాన్ని అంగీకరించబోమని తప్పు పట్టారు. తన అసమ్మతిని బహిరంగంగానే ఆయన వ్యక్తం చేశారు. ఏకపక్షంగా ఉత్తం కుమార్ రెడ్డిని నియమించారని ఆయన అన్నారు.సీనియర్ ల అభిప్రాయం తెలుసుకున్న తర్వాత నియమించి ఉండాలసిందని అన్నారు. ఇప్పటికే విహెచ్ కూడా ఈ నియామకాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉత్తం కుమార్ రెడ్డికి సీనియర్ లు సహకరించరని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.తనకు వ్యక్తిగతంగా కూడా ఈ నిర్ణయం బాధించిందని అన్నారు. సర్వే చేసి బలమైన నేతకు బాధ్యత ఇవ్వడానికి హై కమాండ్ నిర్ణయం తీసుకుని ఉండాల్సిందని అన్నారు. అయితే తాను పార్టీ వీడనని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి నియామకంలో అధిష్టానం మరోసారి తప్పుడు నిర్ణయం తీసుకుందని కోమటి రెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. మాతో సంప్రదించకుండానే, కార్యకర్తల మనోభావాలు తెలుసుకోకుండానే పీసీసీ అధ్యక్షుడిని అధిష్టానం ఎంపిక చేసిందని కోమటిరెడ్డి ఆరోపించారు. పీసీసీ అధ్యక్షుడికి ఎట్టి పరిస్థితుల్లో సహకరించేది లేదని తేల్చి చెప్పారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి నియామకంపై సోనియా ఆమోదం తెలిపారు. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డిని హైకమాండ్ ఏకపక్షంగా నియమించిందని ఆయన మంగళవారమిక్కడ విలేకర్ల సమావేశంలో అన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ల అభిప్రాయాల్ని తీసుకుంటే బాగుండేదని కోమటిరెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్‌లో సర్వే చేయించి బలమైన నేతకే టీ.పీసీసీ చీఫ్ పదవి ఇచ్చి ఉంటే పార్టీ బలపడేదని ఆయన వ్యాఖ్యానించారు. వ్యక్తిగతంగా ఈ నియామకం తనను బాధించిందని, కొందరు సీనియర్లు కొత్త పీసీసీ అధ్యక్షుడికి సహకరించరని కోమటిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని, సీఎల్పీ డిప్యూటీ నేతగా పార్టీ కోసం పని చేస్తానని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్యను తొలగించి..ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమించిన విషయం తెలిసిందే.




