బలవంతపు భూములను తిరిగి ఇచ్చేస్తాం: జగన్
గుంటూరు,మార్చి3(జనంసాక్షి): రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుని వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీడీపీ నేతలపై మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం తీసుకున్న భూములు తిరిగిచ్చేస్తామని హావిూ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల వేళ ఇచ్చిన హావిూలను అధికారంలోకి వచ్చాక మర్చిపోయారని విమర్శించారు. మంగళవారం ఏపీ రాజధాని ప్రాంతంలోని ఉండవల్లిలో పర్యటించిన ఆయన అక్కడి రైతులతో మాట్లాడారు. గ్రామంలో పర్యటించి పంటపొలాలను పరిశీలించారు. అనంతరం వైఎస్ జగన్..రాజధాని ప్రాంత రైతులతో ముఖాముఖిగా మాట్లాడారు.వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రైతులకు అండగా వైసీపీ పోరాటం సాగిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా ఏపీ ప్రజలను నిరాశపర్చేలా వ్యవహరిస్తోందని జగన్ దుయ్యబట్టారు. రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వం భూసేకరణ చేపట్టిందని అన్నారు. రైతులకు ఇష్టం లేకుండా బలవంతంగా భూములు లాక్కునే ప్రయత్నం చేయటం సరికాదన్నారు. రైతులకు అండగా, తోడుగా వైఎస్‌ఆర్ సీపీ మొదటి నుంచి పోరాటం చేస్తూ వస్తుందన్నారు. మంగళగిరి వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నిరాహార దీక్ష చేశారని, అలాగే రైతులకు భరోసా కల్పించేందుకు పార్టీ ఎమ్మెల్యేలు ధర్నాతో పాటు పాదయాత్ర చేశారని వైఎస్ జగన్ చెప్పారు. ఇక రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అన్యాయంపై రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా, దేశవ్యాప్తంగా అందరికీ అవగాహన ఉందన్నారు. బహుళ పంటలు పండే భూమిని ప్రభుత్వానికి ఆ హక్కును కట్టబెట్టేలా చేసే సవరణలను వైఎస్‌ఆర్ సీపీ వ్యతిరేకించదన్నారు. కేంద్ర స్థాయిలో కూడా భూసేకరణ చట్టంలో సవరణలను వైఎస్‌ఆర్ సీపీ వ్యతిరేకిస్తోందన్నారు.
రాజధాని ప్రాంతంలో బలవంతంగా తీసుకున్న రైతుల భూములను తాము అదికారంలోకి రాగానే తిరిగి ఇచ్చేస్తామనిప్రకటించారు.ఉండవల్లి పెనుమాక, తాడేపల్లి తదితర గ్రామాలలో ఆయన రైతులను పరామర్శించారు.శాసనసభలో ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తామని ఆయన అన్నారు.టిడిపి ప్రభుత్వం రెండు,మూడేళ్లలో కూలిపోతుందని ఆయన అన్నారు.పలువురు రైతులు, రైతు మహిళలు జగన్ ను కలిసి తమ గోడు విన్నవించుకున్నారు.పంట పొలాలను బలవంతంగా లాక్కుంటున్నారని వారు వాపోయారు. కొందరు మహిళలు కన్నీరు మున్నీరయ్యారు




