Wednesday, 4 November 2026

పుట్ట లింగమ్మ ట్రస్ట్ మెగా జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలి

–

 

 

 

 

 

 

పోస్టర్ ఆవిష్కరించిన జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్ జనం సాక్షి , మంథని :
ఎవరైనా సేవలు చేస్తామని ముందుకు వస్తే వాటిని వినియోగించుకుని తమ సేవలని మంథని ఎమ్మెల్యే ప్రచారం చేసుకుంటూ గొప్పలు చెప్పుకుంటున్నాడని బీఆర్ ఎస్ పార్టీ మంథని నియోజకవర్గ ఇంచార్జీ ,పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్ ఎద్దేవా చేశారు. మంథని పట్టణంలోని రాజాగృహ లో పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్టు ఆద్వర్యంలో ఈ నెల 20 న మంథని పట్టణంలో ని ఎస్‌ఎల్బీ గార్డెన్‌లో నిర్వహించే మెగా జాబ్‌ మేళా పోస్టర్లను పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ , మంథని మున్సిపల్ ఛైర్పర్సన్ పుట్ట శైలజ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా జడ్పీ ఛైర్మన్ మాట్లాడుతూ.. పుట్ట లింగమ్మ ట్రస్టు చారిటబుల్ ఆధ్వర్యంలో తాము అనేక సేవలు నిర్వహిస్తుంటే తమ సేవలకు కౌంటర్‌గా ఇటీవల పోలీస్‌ ట్రేనింగ్‌ అభ్యర్ధులకు శిక్షణ పేరిట కార్యక్రమాలను నిర్వహించారన్నారు. అంతే కాకుండా పోటీ పరీక్షలకు సిద్దమయ్యే అభ్యర్ధులకు శిక్షణ ఇచ్చేందుకు హైదరాబాద్‌కు చెందిన పీజేఆర్‌ సంస్థ ముందకు వస్తే మంథనిలో తామే శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని గొప్పలు చెప్పుకున్నారని, ఈనాడు గ్రూపు 1 గ్రూపు 2 అభ్యర్ధులకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారని, అయితే ఒక్క ట్రేనర్‌ లేకుండా తరగతులు నిర్వహించడం వారి కపట సేవలకు నిదర్శమన్నారు. కేవలం మంథనికి చెందిన ఒక కౌన్సిలర్‌ మాత్రమే అభ్యర్ధులకు తరగతులు నిర్వహిస్తున్నాడని, ఇక్కడ వచ్చే అభ్యర్ధులు ఎక్కడకి వెళ్లలేని దుస్థితి ఏర్పడిందని ఆయన వాపోయారు. ఆనాడు నియోజకవర్గంలోని ఎస్సీ ఎస్టీ, బీసీ మైనార్టీతో పాటు అగ్రవర్ణాల్లోని పేదలకు సేవలు అందించాలని పుట్ట లింగమ్మ ట్రస్టును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ట్రస్టు ద్వారా అనేక సేవలు చేశామని గుర్తు చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎంతో మంది నిరుపేదలకు అండగా నిలిచి వారిని ట్రస్టు ద్వారా నిత్యావసర సరుకులు అందింంచామన్నారు. అలాగే కరోనా బాధితులకు ధైర్యం చెప్పి వారికి కావాల్సిన మందులు అందించామన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ఎక్కడెక్కడో ఇరుక్కుపోయిన ప్రజలను తమ వాహనాల ద్వారా స్వంత గ్రామాలను తీసుకువచ్చామని, కరోనాతో మృతి చెందిన వారి అంత్యక్రియలు జరిపేందుకు అయిన వారే ముందుకు రాకుండా ట్రస్టు ద్వారా మృతుల ఆఖరి మజిలీకి గౌరవం దక్కాలనే ఆలోచనతో దగ్గరుండి అంత్యక్రియలు జరపించామని ఆయన తెలిపారు. అదే విధంగా కరోనా పరిస్థితుల్లో అనేక సేవలు అందించిన ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌సేవలను గుర్తించి మీ సేవలకు మా సత్కారం పేరుతో వారికి గౌరవించి చరిత్ర చాటామన్నారు. ఇప్పటికే ప్రభుత్వ జూనియర్‌, డిగ్రి కళాశాలల్లో ట్రస్టు మోటివేషన్‌ అండ్‌ పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి అనుసందానంగా ఈ నెల 20న మెగా జాబ్‌ మేళాకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. మంథని నుంచి హైదరాబాద్‌ వరకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా 40కంపెనీల సహకారంతో ఈ మేళాను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. నియోజకవర్గంలోని అణగారిన వర్గాల ఆకలి తీర్చాలన్నదే తమ ఆకాంక్ష అని, ఆ దిశగానే అనేక విదాలుగా ఆలోచనలు చేస్తున్నామని ఆయన చెప్పారు. అనేక కష్టాలు పడి చదువుకున్న ప్రతి పేదవాడికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతో మెగా జాబ్‌ మేళాను ఏర్పాటు చేస్తున్నామని, ఈ అవకాశాన్ని నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.