మునిపల్లి, ఏప్రిల్ 24, జనంసాక్షి: జూనియర్, ఔట్ సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలనీ టీపీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు నీరడి రాజు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో శుక్రవారం నుంచి జేపీఎస్ లు, ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు పూర్తిస్థాయిలో సమ్మె చేపట్టారు. నాలుగు సంవత్సరాల ప్రోహిబిషన్ పీరియడ్ ను పరిగణలోకి తీసుకొని తమకు రెగ్యులరైజ్ చేయాలన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే సమ్మెను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కష్టపడి గ్రామాల్లో పనిచేసి జాతీయస్థాయిలో అవార్డులు తీసుకురావడంలో కృషి చేసిన తమకు ప్రభుత్వం విస్మరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పంచాయతీ కార్యదర్శులు అందరూ అఫీషియల్ గ్రూపుల నుంచి ఎగ్జిట్ అయ్యారు. పల్లెల అభివృద్ధిలో క్రియాశీలకంగా పనిచేసిన కార్యదర్శులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. పల్లెలకు ప్రగతి చక్రాలుగా నిలిచిన తమను పట్టించుకోకపోవడం సరైందికాదని పంచాయతీ కార్యదర్శులు విమర్శించారు. మనిపల్లి మండల కేంద్రంలో చేపట్టిన సమ్మెలో టిపిఎస్ఎఫ్ మండల అధ్యక్షులు మహేందర్, ప్రధాన కార్యదర్శి వీరేశం, ఉపాధ్యక్షులు సరిత, ఇతర కార్యదర్శులు రాజ్ కుమార్, శ్రీకాంత్, రమేష్, ఆనంద్, వాణి, సుమలత, నాజీయా, లక్ష్మి, సంతోష్, షాజహాన్, అక్తర్, అనిల్ రామ్, రవి, సునీత తదితరులు పాల్గొన్నారు.




