ఏటూరునాగారం (జనం సాక్షి),ఏప్రిల్ 28. సీఐటీయూ జిల్లా కమిటీ సమావేశం స్థానికశ్రీ శ్రీనివాస కల్యాణ మండపం లో జిల్లా అద్యక్షులు ఎండి దావూద్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశ ముఖ్య అతిథిగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి మధు హాజరైమాట్లాడుతూ కార్మిక వర్గం పోరాట స్ఫూర్తి దినం మే డేను వారం రోజులపాటు జిల్లాలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఘనంగా గ్రామ గ్రామమునా పండుగలా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. గత 136 వ మే డే స్ఫూర్తి తో కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కులను నీరుగార్చడానికి, కార్మిక చట్టాలను కేంద్ర బిజెపి ప్రభుత్వము తొలగించి 4 లేబర్ కోడుల ద్వారా బహుళజాతి సంస్థలకు లాభాలను చేకూర్చే విధంగా పూనుకున్నది. ఆనాటి మేడే స్ఫూర్తి ద్వారా పనిగంటల తగ్గింపు తో పాటు అనేక కార్మిక చట్టాలు కార్మిక పోరాటాల ద్వారా రూపొందించబడినాయి. కార్మికుల రక్తతర్పణాలు, త్యాగాలు, కేసులు, నిర్బంధాలు, జైలుజీవితం ద్వారా కార్మిక చట్టాలను సాధించుకున్నాము. నాడు దేశభక్తియుత పోరాటంలో పాల్గొనని బిజెపి ప్రభుత్వం దేశభక్తి పేరు చెప్పుకొని అంతర్జాతీయ బహుళజాతి సంస్థలకు కార్మిక వర్గ హక్కులను అప్పన్నంగా అప్పజెప్పేందుకు పనిగంటలను తొలగించింది.కార్మిక చట్టాలను తొలగించి యజమాన్యాలకు అడుగులకు మడుగులోత్తే విధంగా లేబర్ కోడ్ లు తీసుకురావడం వల్ల కార్మికులకు కనీసం గా అమలు అవుతున్న చట్టాలు అమలు కాకుండా నేటి బిజెపి ప్రభుత్వం కార్మికులను మోసం చేస్తున్నది. కాబట్టి ఈ మేడే మే 1 నుండి 7 తారీఖు వరకు వారోత్సవాల ద్వారా కార్మికుల్లో ప్రత్యామ్నాయ శ్రమ సంస్కృతిని పెంచే విధంగా కార్యక్రమాలు రూపొందించుకోవాలని తెలియజేశారు. మేడే దినం సెలవు దినము కాదు, వినోద దినము కాదు ,అవార్డులు, రివార్డుల కోసం మేడే జరుపకుండ చికాగో అమర వీరుల ఫొటోస్ పట్టుకొని ర్యాలీ,సభలు నిర్వహించలని తెలియ చేశారు.పాలకులు కార్మికులను అడుక్కునే విధంగా తప్పుదోవ పట్టించే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నాయి. మేడే అనేది కార్మికుల రక్త తర్పణ ద్వారా ఎర్రజెండాగా రూపొందింది. కాబట్టి శ్రమ సంస్కృతిని పనికి తగిన వేతనం, ఇతర సౌకర్యాలు కావాలని పోరాడే దినంగా సీఐటీయూ ఆధ్వర్యంలో ఘనంగా మే డే నిర్వహించాలి అన్నారు..
ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ ,జిల్లా ఉపాధ్యక్షులు కట్ల నర్సింహా చారీ, ఆర్ నీలాదేవి, బలోజు రమేష్, మాడె రవి, పోషాలు, సరిత, కాళిక,విష్ణు,రంజిత్ కుమార్, రాజు, శ్రీను క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు .




