Wednesday, 4 November 2026

పెళ్లిపేరుతో మోసం

హైదరాబాద్‌ సిటీ: మ్యాట్రిమోని డాట్‌ కాం ద్వారా నైజీరియన్‌ మోసగాళ్లు 60 ఏళ్లు పైబడిన బామ్మను వంచించిన ఘటనను మరువక ముందే 54 ఏళ్ల వయస్సు గల మరో మహిళ మోసపోయింది. పెళ్లి కోసం సిద్ధపడిన ప్రొఫైల్‌ను మ్యాట్రిమోని డాట్‌ కాం ద్వారా గమనించి ఆమెకు ఫోన్‌ చేసి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. భర్త దూరం కావడం, పెళ్లయిన కుమారుడు వేరే ప్రాంతంలో ఉండడంతో ఒంటరిగా ఉంటూ తోడు కోసం తార్నాకకు చెందిన మహిళ మ్యాట్రిమోని డాట్‌కాం కన్నడలో రిజిస్టర్‌ చేసుకుంది. ఆమె కంటే మూడేళ్లు తక్కువ వయస్సుగల చంద్రం డేవిడ్‌ పటేల్‌ పేరుతో నైజీరియాకు చెందిన లూయిస్‌ అఫమేపునా కన్నడలో రిజిస్ట్రర్‌ చేయుంచుకుని ఆమెతో ఫోన్‌ ద్వారా పరిచయం చేసుకున్నాడు. నెల రోజుల క్రితం ఇతడిని అరెస్టు చేసిన పోలీసులు ఈ కేసులో ఇద్దరు నైజీరియన్‌ అన్నదమ్ములు… వీరికి సహకరించిన బీహార్‌, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరిని అరెస్టు చేశారు. పోలీస్‌ కంట్రోల్‌ రూంలోని సమావేశ మందిరంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో సీసీఎస్‌, డిటెక్టివ్‌ డిపార్ట్‌మెంట్‌ అడిషనల్‌ కమిషనర్‌ టి.ప్రభాకర్‌ రావు, సైబర్‌ క్రైమ్స్‌ ఏసీపీ అనూరాధ, ఇన్‌స్పెక్టర్‌ కేవీఎం ప్రసాద్‌ వివరాలను వెల్లడించారు. నైజీరియాకు చెందిన ఇగ్‌బుటే కింగ్స్‌లే ఉచెక అలియాస్‌ టోని అలియాస్‌ క్రిస్‌ వ్యాపార వీసాతో మన దేశానికి వచ్చి ఢిల్లీలో నివసిస్తున్నాడు. అతడి తమ్ముడు ఇగ్‌బుటే జుడే న్వాబ్‌లర్‌ను స్టూడెంట్‌ వీసాపై మన దేశానికి రప్పించాడు. వీరివురూ మ్యాట్రిమోని డాట్‌ కాంద్వారా మోసం చేస్తున్న లూయిస్‌ అఫమేపునాకు సహకరించారు. నైజీరియన్‌ అన్నదమ్ములకు బ్యాంక్‌అకౌంట్లు, సిమ్‌ కార్డులు ఇప్పించడంలో బీహార్‌కు చెందిన సంతోష్‌కుమార్‌ అలియాస్‌ సుమన్‌, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ధీరేంద్ర కుమార్‌ అలియాస్‌ ధనుష్‌ అలియాస్‌ రాహుల్‌ పాండే సహకరించారు.
ఫోన్‌ ద్వారా గాలం
అమెరికాలోని ఫ్లోరిడాలో క్రూయుజ్‌ (షిప్‌) ఆపరేషన్‌ పేరుతో చంద్రం డేవిడ్‌ పటేల్‌ మహిళతో పరిచయం పెంచుకున్నాడు. గ్లోబల్‌ సెక్యూరిటీ్‌స్‌ ద్వారా ఖరీదైన గిఫ్ట్‌ పంపుతున్నానని ఫోన్‌ చేశాడు. ఆ తర్వాత కస్టమ్స్‌ సుంకం, ఇన్‌కంటాక్స్‌ అంటూ పలు దఫాలుగా బాధితురాలి నుంచి రూ.15.62 లక్షలను తన ఖాతాకు బదిలీ చేయించుకున్నాడు. ఈ కేసులో కింగ్‌ఫిన్‌ చంద్రం డేవిడ్‌ పటేల్‌కు సహకరించిన ఇగ్‌బుటే కింగ్స్‌లే ఉచేకా అలియాస్‌ టోని అలియాస్‌ క్రిస్‌, అతని తమ్ముడు ఇగ్‌బుటే జుడే న్వాబ్‌లర్‌తోపాటు సిమ్‌ కార్డులు ఇప్పించడం, కమీషన్‌ మీద బ్యాంకు అకౌంట్లు ఇప్పించిన బీహార్‌కు చెందిన సంతోష్‌ కుమార్‌ అలియాస్‌ సుమన్‌, ధీరేంద్ర కుమార్‌ అలియాస్‌ ధనుష్‌ అలియాస్‌ రాహుల్‌ పాండేను అరెస్టు చేశారు. మీసేవ అకౌంట్‌ను హ్యాక్‌ చేసి రూ.20.59లక్షలను తన ఖాతాకు మళ్లించిన కేసులో రాహుల్‌ పాండే నిందితుడు.
స్వాధీనం చేసుకున్న నగదు, వస్తువులు
మూడు లాప్‌ట్యాప్‌(రెండు నైజీరియన్స్‌, ఒకటి సంతోష్‌కుమార్‌ నుంచి)లు, రూ. 1.38 లక్షలు, 350 యూఎస్‌ డాలర్లు, 9 వేల నీరోస్‌ (నైజీరియన్‌ కరెన్సీ), నిందితులు ఉపయోగించిన 10 సెల్‌ఫోన్లు, 3 నెట్‌ కనెక్షన్‌ డేటా కార్డులు. సీసీఎస్‌ ఏఎస్‌ఐ మహేశ్వర్‌రెడ్డి, కానిస్టేబుల్‌ దిలీప్‌కుమార్‌ నెలరోజులుగా ఢిల్లీలో మకాం వేసి కాల్‌డేటా, అకౌంట్ల ఆధారంగా నిందితులను గుర్తించినట్టు తెలిపారు. నిందితులు నలుగురిని ఈనెల 13వ తేదీన ఢిల్లీలో అరెస్టు చేసి ట్రాన్సిట్‌ వారంట్‌ కింద నగరానికి శుక్రవారం తీసుకువచ్చి కోర్టులో హాజరుపర్చగా జుడిషియల్‌ రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు నిమిత్తం నిందితులను తమ అదుపులోకి తీసుకోవటానికి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయనున్నట్టు పోలీసులు తెలిపారు.
పరారీలో ఏజెంట్లు, అకౌంట్‌ హోల్డర్లు
నిందితులైన నైజీరియాకు చెందిన ఏజెంట్లు జేమ్స్‌, మహేష్‌కుమార్‌ తివారీతోపాటు అకౌంట్‌ హోల్డర్లు ప్రవీణ్‌సింగ్‌, నిఖిల్‌కుమార్‌ శర్మ, సామీర్‌ గుప్త, సునీల్‌ కుమార్‌, సందీప్‌ మిశ్రా, లలిత, అశోక్‌ సింగ్‌ పరారీలో ఉన్నారని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *