Thursday, 5 November 2026

పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి

పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి
బిజెపి జిల్లా అధ్యక్షురాలు తార
బిచ్కుంద మార్చి20 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలకేంద్రంలో సోమవారం నాడు భాజాపా టీఎస్ పీఎస్ సీ పేపర్ లీకేజీపై నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా జిల్లా భాజాపా అధ్యక్షురాలు జుక్కల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అరుణ తార మాట్లాడుతూ తెలంగాణ నిరుద్యోగ యువత నోట్లో మట్టికొట్టి తన ఇంటికే ఐదు ఉద్యోగాలు ఇచ్చుకున్న కేసీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ నేతల పుత్రరత్నాలకు, బంధువులకు ప్రభుత్వ కొలువులు ఇప్పించే కుట్ర చేశారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ నియామకాల్లో అక్రమాలకు పాల్పడి 30 లక్షల మంది యువతీ, యువకుల జీవితాలను ఆగం చేశారని విచారణ వ్యక్తం చేశారు. గ్రూప్-1 పరీక్షకు సంబంధించి ఒక్కొక్క విషయం వెలుగు చూస్తున్న కొద్దీ టీఎస్ పీఎస్ సీ స్కాం అనుకున్న దానికన్నా చాలా పెద్దదని అర్థమవుతోందన్నారు. బీఆర్ఎస్ నేతల పిల్లలు, బంధువులు, వారివద్ద పని చేసే వాళ్లను గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షల్లో క్వాలిఫై చేసినట్టు తెలుస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. ఒక సర్పంచ్ కుమారుడికి అర్హతలు లేకున్నా దొడ్డిదారిన క్వాలిఫై చేశారని ఆరోపించారు. ఇదంతా కేసీఆర్ కొడుకు కనుసన్నల్లోనే జరిగిందని పేర్కొన్నారు. ఇందుకు ఒక్కొక్కరి దగ్గర నుంచి 3 నుండి 5 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం ఉందన్నారు. నిరుద్యోగ యువతకు అన్యాయం చేసి అనర్హులకు ఉద్యోగాలిప్పిస్తున్న కేసీఆర్ కొడుకును తక్షణమే కేబినెట్ నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సీఎం కొడుకు ప్రమేయం ఉన్న నేపథ్యంలో ఆయన నియమించిన సిట్ తో నిష్పక్షపాత విచారణ ఎలా సాధ్యమని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేందుకు అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు. నయీం డైరీ, టాలీవుడ్ డ్రగ్స్ కేసు, మియాపూర్ ల్యాండ్ కేసు, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ సూసైడ్ కేసు తరహాలోనే పేపర్ లీకేజీ కేసును సైతం సిట్ కు అప్పగించి పక్కదారి పట్టించే కుట్ర జరుగుతోందన్నారు. లక్షలాది మంది నిరుద్యోగులను వంచించిన కేసీఆర్ ప్రభుత్వం 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. లేనియెడల భారతీయ జనతా పార్టీ యూవమొర్చ ధర్నాలు రాస్తారోకోలు ఉద్యమం చేసి టీఎస్పీఎస్ అభ్యర్థులకు నష్టపరిహారం చెల్లించే విధంగా చెల్లించే వరకు పోరాటం జరుగుతుంది.