Wednesday, 4 November 2026

పేరు కాదు అభివృద్ధిని చూడాలి

పథకాల పేరుపై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నరని ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. పథకాల పేరు కాదు.. జరుగుతున్న అభివృద్ధి చూడాలని పేర్కొన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా పరిస్థితిపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో రైతు సమస్యలు, విద్యుత్ సరఫరా, తాగునీరు లభ్యతపై ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ వస్తే ఏమోస్తదని ఎగతాళి చేసిన వారికి 14 నెలల్లో అభివృద్ధి చేసి చూపించినం అన్ని అన్నారు. సంక్షేమ రంగానికి రూ. 28 వేల కోట్లు ఖర్చు చేస్తూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని చెప్పారు.
అర్హులందరికీ పెన్షన్లు ఇస్తున్నమని..కాంగ్రెస్ హయాంలో సంక్షేమం కోసం కేవలం రూ. 800 కోట్లు ఖర్చు పెట్టిన్రని.., పింఛన్ల కోసం రూ. 4,500 కోట్లు ఖర్చు చేస్తున్న ఘనత టీఆర్‌ఎస్‌దేనన్నారు. అర్హులైన వారికి ఇళ్లు ఇస్తామని, పెండింగ్ బిల్లులను చెల్లిస్తున్నమని చెప్పారు. త్వరలో డబుల్ బెడ్‌రూం ఇళ్లను ప్రారంభిస్తమని చెప్పారు. రాబోయే ఎండాకాలం నుంచి వ్యవసాయానికి పగటిపూట 9 గంటల విద్యుత్ ఇస్తామని మంత్రి తెలిపారు. 60 ఏళ్ల పాలనలో చేతగానితనం వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నరని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతుల ఆత్మహత్యలపై మాట్లాడే హక్కు కాంగ్రెస్, టీడీపీ ఎప్పుడో కోల్పోయిందని అన్నారు. రుణమాఫీ కోసం రూ. 17 వేల కోట్లు ఇచ్చినం. అనవసరంగా ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొడుతున్నాయని.., అయినా రైతులు వారిని పట్టించుకోరని చెప్పారు. పాలమూరు జిల్లాను దత్తత తీసుకున్న నేతలు జిల్లాకు ఒరగబెట్టిందేమి లేదని అన్నారు. తాము ప్రజలకు జవాబుదారీగా ఉంటామని తెలిపారు. గ్రామాల అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యమే కీలకమని దీనికోసమే గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు. గ్రామాలను అభివృద్ధి చేసుకున్నప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమైతదని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *