పోలీసుల చాపర్‌పై కాల్పులు : నలుగురి మృతి

మెక్సికో సిటీ: మెక్సికోలోని మిచోవాకన్‌ ప్రాంతంలో పోలీసులతో ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌పై దుండగులు కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో నలుగురు పోలీసులు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. మిచువాకన్‌ ప్రాంతంలో అల్లర్లు ఎక్కువగా జరిగే అపాట్‌జింగన్‌ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో నిమగ్నులైన ముఠాలు ఇలాంటి దారుణాలకు ఒడిగడుతుంటాయి. గత ఏడాది ఇదే ప్రాంతంలో ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్‌ని కూల్చేశారు. దాంతో ఆరుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుత ఘటనకు ఏ గ్యాంగ్‌ కారణమన్న దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.