Wednesday, 4 November 2026

ప్రజాస్వామ్య పరిరక్షణ కమ్యూనిస్టులతోనే సాధ్యం – పులిచింతల వెంకట్ రెడ్డి మృతి పార్టీకి తీరనిలోటు – సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

 

 

 

 

 

హుజూర్ నగర్ మే 27 (జనంసాక్షి):దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కమ్యూనిస్టులతోనే సాధ్యమవుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. శనివారం హుజూర్ నగర్ లో జరిగిన సిపిఎం సీనియర్ నాయకులు పులిచింతల వెంకటరెడ్డి అంతిమయాత్రలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలో కాలానుగుణంగా మారుతున్న పరిస్థితుల నడుమ తాత్కాలికంగా కమ్యూనిస్టులు కొంతమేర బలహీనపడ్డ  చివరికు  ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసేది కమ్యూనిస్టులే అన్నారు. కమ్యూనిస్టుల పని అయిపోయిందని కొందరు అవాకులు ,  చవాకులు పేలినప్పటికీ కేవలం అట్టి మాటలు ఎక్కడా నిజం  కాలేదన్నారు. కమ్యూనిస్టు సిద్ధాంతానికి  శాస్త్రీయత ఉన్నదని మానవ మనుగడకు ఎంతగానో దోహదపడుతుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలో ఇటీవల సిపిఐ, సిపిఎం లు ఉమ్మడిగా సమావేశం జరిపి ఐక్య ఉద్యమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ప్రజా ఉద్యమాలకు సంబంధించి రానున్న కాలంలో మరిన్ని శుభకర పరిణామాలు జరగనున్నాయని తెలిపారు. పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేసే పులిచింతల వెంకటరెడ్డి ఆకస్మికంగా మృతి చెందడం పార్టీకి తీరని లోటు అన్నారు. ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
– ప్రజా ఉద్యమాలకు తీరని లోటు…
సిపిఎం సీనియర్ నాయకులు పులిచింతల వెంకటరెడ్డి మృతి ప్రజా ఉద్యమాలకు తీరనిలోటని పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మి, రాష్ట్ర నాయకులు నంద్యాల నరసింహారెడ్డి, జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. శనివారం స్థానికంగా జరిగిన వెంకటరెడ్డి అంతిమయాత్రలో వారు పాల్గొని మాట్లాడారు. ఆయకట్టు ప్రాంతంలో రైతాంగ సమస్యల పరిష్కారం కోసం జరిగిన ప్రతి ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర మరువలేనిది అన్నారు. పార్టీ ఇచ్చిన ప్రతి పిలుపులో  ముందు వరుసలో నిలబడి పనిచేశారని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ ,జిల్లా కమిటీ సభ్యులు నాగారపు పాండు, నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, పల్లా వెంకటరెడ్డి, దుగ్గి బ్రహ్మం, వట్టెపు సైదులు , షేక్ .యాకోబ్, డి. రవి నాయక్, బుర్రి శ్రీరాములు, పారేపల్లి శేఖర్ రావు, మండల కార్యదర్శి పోషణ బోయిన హుస్సేన్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శీలం శ్రీను, కౌన్సిలర్ త్రివేణి, అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
– ఎమ్మెల్యే సైదిరెడ్డి సంతాపం….
సిపిఎం సీనియర్ నాయకులు  వెంకటరెడ్డి మృతి పట్ల స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. శనివారం స్థానికంగా ఆయన మృతదేహాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన వెంట జడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చిట్యాల అమర్నాథరెడ్డి, ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ అమర్,  సీనియర్ నాయకులు అట్లూరి హరిబాబు తదితరులు పాల్గొన్నారు.
అఖిలపక్ష నాయకుల సంతాపం….
పట్టణానికి చెందిన బీఆర్ఎస్, సీపీఐ ,న్యూ డెమోక్రసీ, టిడిపి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు అఖిల పక్ష నాయకులు శనివారం స్థానికంగా జరిగిన వెంకటరెడ్డి అంతిమయాత్రలో పాల్గొని సంతాపం తెలిపారు. సంతాపం తెలిపిన వారిలో సిపిఐ రాష్ట్ర నాయకులు పశ్య పద్మ, ఎల్లావుల రాములు, కంబాల శ్రీనివాస్, కొప్పోజు సూర్యనారాయణ, , ఒక్క వంతుల కోటేశ్వరరావు, ఎలక వెంకటేశ్వర్లు, పాలకూరి బాబు, గుండు వెంకటేశ్వర్లు, ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎరగాని నాగన్న గౌడ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జున్, గల్లా వెంకటేశ్వర్లు, జక్కుల మల్లయ్య, పులిచింతల వెంకటరెడ్డి, చింతకాయల రాము తదితరులు పాల్గొన్నారు.