Wednesday, 4 November 2026

ప్రతి రైతుకు అందుబాటులో ఉండేలా కొనుగోలు కేంద్రాలు – జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌

 

 

 

 

 

 

జనంసాక్షి, మంథని : దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అండగా నిలుస్తూ పంటల సాగును ప్రోత్సహిస్తున్నారని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అన్నారు.మంథని మండలం కన్నాల గ్రామంలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పుట్ట మధుకర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాకముందు ఉమ్మడి రాష్ట్రంలో పరిపాలన అందించిన ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని, రైతులను పట్టించుకోలేదన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్‌ పరిపాలనలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారని, అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు. ఆనాడు రాష్ట్ర వ్యాప్తంగా పంట సాగు విస్తీర్ణం కంటే ఈనాడు రెట్టింపు స్థాయి విస్తీర్ణంలో పంట సాగుచేస్తున్నారని, పంట సాగుకు భరోసా కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఉచిత 24గంటల కరెంటు, రైతు బీమా, పెట్టుబడి సాయం, ఎరువుల పంపిణీలాంటి పథకాలు అమలు చేస్తూ దేశంలోని రాష్ట్రాన్ని తెలంగాణా వైపు చూసేలా చేశారన్నారు. వివిధ కారణాలతో రైతు మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడకుండా రైతు బీమా పథకం తీసుకువచ్చి రైతు కుటుంబాలకు భరోసా కల్పించారని ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా పండించిన పంటకు మద్దతు ధర చెల్లించడంతో పాటు పంట సాగు కోసం పెట్టు బడి సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్ర తెలంగాణ రాష్ట్రమేనని ఆయన అన్నారు. రైతులు తమ పంటను అమ్ముకోవడానికి ఇబ్బందులు పడుతుంటే ఊరూరా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి అందుబాటులోకి తీసుకువచ్చారని ఆయన అన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని కొనుగోలు కేంద్రాల్లోనే తమ పంటను అమ్ముకోవాలని సూచించారు. అలాగే కేంద్రాల్లో ధాన్యం అమ్ముకోవడానికి వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా నిర్వాహకులు అన్ని వసతులు కల్పించాలని ఆయన సూచించారు.