సికింద్రాబాద్: ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామని దక్షిణమధ్యరైల్వే హైదరాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ అరుణాసింగ్ చెప్పారు. బుధవారం జరిగిన హైదరాబాద్ డివిజనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై నాటికి డివిజన్ సాధించిన పురోగతి వివరించారు. ప్రయాణికులకు మరిన్ని మెరుగైన సదుపాయాలు కల్పించడానికి కృషి చేస్తున్నట్టు వివరించారు. రైల్వే స్టేషన్లు, రైల్వే ఆవరణలు పరిశుభ్రంగా ఉండడానికి ప్రయాణికులను చైతన్యపరచాలని సభ్యులకు సూచించారు. 2016లో రానున్న కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని గద్వాల, కర్నూలు పట్టణాల్లో ఏర్పాటు చేయనున్న సదుపాయాల గురించి హాల్టు ఏజంట్లకు అవగాహన కల్పించాలన్నారు. అదనపు డీఆర్‌ఎం బీఎస్‌కే.రాజ్‌కుమార్, డీఆర్‌యూసీసీ కార్యదర్శి బీ.డీ.క్రిస్టోఫర్ తదితరులు పాల్గొన్నారు.




