-అక్రమ కట్టడాలను కూల్చివేసి చెరువును కాపాడాలి.
-కృష్ణా నది జలాల హక్కులను కాలరాయడం దారుణం.
-సంగమేశ్వర ఎత్తిపోతల పథకం పనులను కోర్టుకు వెళ్లి అడ్డుకోవాలి.
-స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి తేడా తెలియని ఎంఎల్ఏ.
-సర్దార్ పాపన్న గౌడ్ స్ఫూర్తితో పోరాటాలకు సిద్ధం కావాలి.
-మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు18(జనంసాక్షి):
కోర్టు తీర్పును గౌరవించి అక్రమ కట్టడాలను కూల్చివేసి చెరువులను కాపాడేందుకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ నేత నాగం జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు.గురువారం జిల్లా కేంద్రంలో ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పాపన్న గౌడ్ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్దార్ పాపన్న గౌడ్ ధైర్య సాహసాలను ఏ విధంగా ప్రదర్శించారో స్ఫూర్తిగా తీసుకొని పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా వికారాబాద్ జిల్లాకు 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని పేర్కొనడం దుర్మార్గమని అన్నారు.శ్రీశైలం రిజర్వాయర్ ద్వారా ప్రతిరోజు రెండు టీఎంసీల నీటిని 60 రోజులపాటు రిజర్వాయర్ ద్వారా నింపుకొని ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వవలసిన అవసరం ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో నీటిని సరఫరా చేయడం లేదని ఇందుకు సంబంధించిన రిజర్వాయర్లను పూర్తి చేయడంలేదని మండిపడ్డారు. 2009 టీఎంసీల నీటిని వాడుకోవాల్సి ఉండగా పాలకుల నిర్లక్ష్యం ఫలితంగా తెలంగాణ వాటాను పూర్తిగా వినియోగించుకోవడంలేదని మండిపడ్డారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా1 లక్ష 60 వేల ఎకరాలకు సాగునీరు అందించవలసి ఉండగా రెండు మోటార్లను మాత్రమే వినియోగించడం వల్ల, రిజర్వాయర్లను ఏర్పాటు చేయకపోవడం వల్ల చెరువులను నింపి ప్రభుత్వం పూర్తి ఆయకట్టుకు నీరు అందిస్తున్నట్లు ప్రగల్బాలు పలుకుతున్నా రని విమర్శించారు.తెలంగాణలో 69.7శాతం భూమి కృష్ణానది పరివాహక ప్రాంతం ఉంటే, ఆంద్రాలో 30.3 శాతం భూమి మాత్రమే కృష్ణానది పరివాహక ప్రాంతం ఉందని కాని నీటి వాడకం ఆంధ్ర వాళ్ళు వినియోగించు కుంటుంటే మన ముఖ్యమంత్రి మాత్రం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.అసలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రాజెక్టుల పై అవగాహన ఉందా అని ప్రశ్నించారు.స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి తేడా తెలియడం లేదని మరియు ప్రతిజ్ఞ చేయడానికి సెల్యూట్ చేయడానికి తేడా కూడా గుర్తించడం లేదని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.సంగమేశ్వర ఎత్తిపోతల పథకం పనులకు తెలంగాణ ప్రాంతం నుంచి మట్టిని తరలిస్తున్నా అక్కడి ఎమ్మెల్యే కానీ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ,ఫారెస్ట్ అధికారులు ఎందుకు అడ్డుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. రాయలసీమ సంగమేశ్వర ఎత్తిపోతల పథకం పనులను కోర్టుకు వెళ్లి అడ్డుకోవాల ని ఆయన డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి అసమర్ధ పాలన వల్ల కృష్ణా నది నీటి హక్కును పూర్తిగా కోల్పోవడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అర్థం రవి,నాయకులు తిమ్మాజిపేట పాండు, నిజాం, సలీం, అర్జునయ్య తదితరులు పాల్గొన్నారు.




