హైదరాబాద్ : ఉమ్మడి రవాణాను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా నిరసన వ్యక్తమౌతోంది. ఏపీ నుండి తెలంగాణకు వచ్చే అన్ని ప్రైవేటు బస్సుల్ని నిలిపివేశారు. తెలంగాణలోనూ ఇదే తరహా ఆందోళన వ్యక్తమైంది. లారీల యజమానులు నిరసన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ కు చేరుకోవడానికి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని ఆర్టీసీ పేర్కొన్నా అలాంటిది ఏమీ జరగలేదని సమాచారం.
నల్గొండ : జిల్లాల నుండి వచ్చే వాహనాలను అధికారులు తనిఖీ చేస్తున్నారు. మూడు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. నిబంధనల ప్రకారం తెలంగాణ పర్మిట్ ఉండాలి..లేదా జాతీయ పర్మిట్ ఉండాల్సి వస్తుంది. అలా లేని వెహికల్ ను అనుమతి లేని వెహికల్స్ గుర్తిస్తారు. ఒక నెలకు సుమార 30వేల వాహనాలు రాకపోకలు సాగిస్తాయని అంచనా. ప్రస్తుతం జరిమాన విధించి వాహన డ్రైవర్లు వెళుతున్నారని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు రూ.50 లక్షలు వసూలు చేసినట్లు అంచనా.
విజయవాడ : తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రైవేటు ఆపరేటర్స్ అగ్గిలమీద గుగ్గిలమౌతున్నారు. వెంటనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ నుండి వెళ్లే బస్సులను ప్రైవేటు ఆపరేటర్స్ నిలుపుదల చేశారు. దీనితో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పినప్పటికీ మంగళవారం రాత్రి అదనపు సర్వీసులు నడుపలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టు క్యారేజీ కింద ప్రస్తుతం ఒక్కో సీటుకు మూడు నెలలకు రూ.2650 పన్ను ఉండగా, దానిని జాతీయ పర్మిట్ కింద రూ.3675 చెల్లించాల్సి రావడం తీవ్ర భారమౌతుందని ప్రైవేటు బస్సు ఆపరేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.




