ప్రొఫెసర్‌ను ఉరికించి కొట్టిన విద్యార్థినులు

సోషల్‌ విూడియాలో వైరల్‌
చండీఘడ్‌,మే7(జ‌నం సాక్షి): విద్యా బుద్ధులు నేర్పాల్సిన గురువు దారి తప్పాడు. కూతురు వయసున్న విద్యార్థినిలతో వెకిలి వేషాలు వేశాడు. అతడి టార్చర్‌ భరించలేని అమ్మాయిలు… కాలేజీ నుంచి బయటకు లాక్కొచ్చి మరీ చితకబాదారు. పంజాబ్‌లోని పాటియాలాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలంరేపింది. పాటియాలా గవర్నమెంట్‌ కాలేజీకి చెందిన ప్రొఫెసర్‌ అక్కడే చదువుతున్న అమ్మాయిల మొబైల్‌ నెంబర్లు సంపాదించాడు. కొద్ది రోజులుగా వారికి అసభ్యకరమైన మెసేజ్‌లు పంపుతూ వాళ్లను వేధిస్తున్నాడు. పద్దతి మార్చుకుంటాడేమోనని కొద్ది రోజులు వేచి చూసినా లాభం లేకుండా పోయింది. పదే, పదే మెసేజ్‌లు వస్తుండటంతో అమ్మాయిలకు కోపం కట్టలు తెంచుకుంది. అంతే నేరుగా కాలేజీకి వెళ్లి ప్రొఫెసర్‌ కాలర్‌ పట్టుకొని బయటకు లాక్కొచ్చారు. అందరూ కలిసి అతడ్ని క్యాంపస్‌లోనే పరిగెత్తించి మరీ కొట్టారు. ఈ సీన్‌ మొత్తాన్ని ఓ విద్యార్థిని మొబైల్‌లో రికార్డు చేసింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా కూడా మారింది. అయితే బాధిత విద్యార్థినిలు పోలీసులకు ఫిర్యాదు చేశారా లేదా అన్నది క్లారిటీ లేదు. అలాగే ప్రొఫెసర్‌ పేరు కూడా బయటకు రాలేదు.