కొత్తపేట, హైదరాబాద్: గుర్తింపు కార్డుల్లో ఫొటోలను మార్ఫింగ్ చేసి బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీల నుంచి నగదు, రుణాలు తీసుకున్న మాదాల చంద్రశేఖర్ (27)ను ఎల్‌బీనగర్ పోలీసులు అరెస్టు చేసి ల్యాప్‌టాప్, 2 సెల్‌ఫోన్లు, సిమ్‌కార్డు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం బీఎన్‌రెడ్డినగర్‌కు చెందిన మాదాల చంద్రశేఖర్ ఎంబీఏ మధ్యలో ఆపేసి ఉద్యోగం కోసం 2015లో నగరానికి వచ్చాడు. పంజాగుట్ట బజాజ్ ఫైనాన్స్ శాఖలో పనిచేస్తూ, క్రెడిట్ కార్డులు పొందడానికి కావాల్సిన అర్హతలు, విధానాలు తెలుసుకున్నాడు. కుప్పిరెడ్డి రాజేష్‌రెడ్డి గుర్తింపు కార్డుల వివరాలు సేకరించి మార్ఫింగ్‌తో ఫొటోలను మార్చేశాడు. వాటితో 2015 జూన్‌లో ఎస్‌బీఐ క్రెడిట్‌కార్డు పొందాడు. ఆ తర్వాత అదే తరహాలో కొటక్ మహేంద్ర, సిటీబ్యాంకు, ఆర్‌బీఎల్ బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డులు సంపాదించాడు. వాటితో టీవీలు, ఖరీదైన ఫోన్లు, ఫ్రిజ్‌లు, దుస్తులు, బంగారు ఆభరణాలు, ల్యాప్‌టాప్ కొనుగోలు చేశాడు. పెద్ద మొత్తంలో నగదూ తీసుకున్నాడు. పంజాగుట్ట బజాజ్‌ఫైనాన్స్‌లో ఎనిమిది రుణాలు తీసుకున్నట్టు సమాచారం. ల్యాప్‌టాప్, రెండు సెల్‌ఫోన్లను తప్ప మిగతా వాటిని ఇతరులకు అమ్మేశాడు. రాజేష్‌రెడ్డి క్రెడిట్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో (ఇండియా) లిమిటెడ్ (సిబిల్) రిపోర్టు కోసం సంప్రదిస్తే అతడి పేరుపై క్రెడిట్ కార్డులు, రుణాలు ఉన్నట్టు తెలిసింది. గుర్తుతెలియని వ్యక్తి తన వివరాలతో గుర్తింపు కార్డులను ఉపయోగించుకున్నాడని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ తరహా నేరం వెలుగుచూసింది. ఆన్‌లైన్‌లో నిర్ధారణ చేసుకోకుండా గుర్తుతెలియని వారికి గుర్తింపు కార్డులు, బ్యాంకింగ్ వివరాలు అందజేస్తే నష్టపోతారని ఈ ఉదంతం తెలియజేస్తుందని పోలీసులు పేర్కొన్నారు.




