Tuesday, 3 November 2026

బంజారాహిల్స్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం

– స్కూటీని ఢీకొనడంతో బస్సుకిందపడిన యువతి
– అక్కడికక్కడే మృతి.. తాత్కాలిక డ్రైవర్‌ను చితకబాధిన స్థానికులు
హైదరాబాద్‌, నవంబర్‌26(జనం సాక్షి) : బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 12లో ఆర్టీసీ బస్సు బీభత్సం చేసింది. స్కూటీపై వెళ్తున్న ఓ యువతిని ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొంది. మహిళ తల పైనుంచి బస్సు చక్రం వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. ప్రమాదంలో ఆమె తల నుజ్జనుజ్జయింది. తాత్కాలిక డ్రైవర్‌ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. మృతి చెందిన యువతిని టీసీఎస్‌ ఉద్యోగిని సోహిని సక్సేనా (26)గా గుర్తించారు. సోహిని మంగళవారం  మధ్యాహ్నం తన ద్విచక్రవాహనంపై మాసబ్‌ ట్యాంక్‌ నుంచి బంజారాహిల్స్‌ వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణమైన తాత్కాలిక డ్రైవర్‌ను స్థానికులు, వాహనదారులు పట్టుకొని దాడి చేశారు. దుస్తులు విప్పి చితకబాదారు. ఆగ్రహంతో ఆర్టీసీ బస్సుపై దాడి చేశారు. మృతదేహం వద్ద ఆందోళన నిర్వహించారు. ప్రమాదంతో మాసాబ్‌ ట్యాంక్‌ – పంజాగుట్ట, మెహిదీపట్నం మార్గాల్లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. అదే ప్రదేశంలో ఐదు సార్లు ఇదే తరహా ప్రమాదాలు చోటు చేసుకున్నాయని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని తాత్కాలిక డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో అతడు బర్కత్‌పుర డిపోలో గత నెల రోజులుగా తాత్కాలిక డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.