బాధిత కుటుంబానికి బాసటగా…
– పోరుబాట పట్టిన కార్మిక సంఘాలు.
– గత శుక్రవారం డీజీఎంఎస్ ను కల్సిన కార్మిక సంఘాలు.
– తప్పుడు నివేదిక సహా వివిధ ఆధారాలు అందజేశారు.
– లక్ష్మినారాయణ కుటుంబానికి న్యాయం చేయాలన్నదే లక్ష్యం
– వర్క్ మెన్ కాంపన్సేషన్ కోసం ప్రధాన పట్టు
– ఏడు నెలల అనంతరం ముదురుతున్న ఆందోళన
– కార్మికుల చావులను సహజ మరణాలుగా చూపెట్టడంపై ఆగ్రహం
. బెల్లంపల్లి నవంబర్ 14, (జనంసాక్షి ):
సింగరేణి లో కార్మిక సంఘాలు మరోసారి పోరుబాట పట్టాయి.. సింగరేణిలో పని చేస్తూ మృత్యువాత పడ్డ ఓ కాంట్రాక్ట్ కార్మికునికి న్యాయం చేయాలనే లక్ష్యంగా ముందుకు సాతున్నాయి. కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతున్న దరిమిలా ఏడు నెలల క్రితం నాటి ఘటన నేడు మరోసారి తెరపైకి వచ్చింది. కార్మికుని చావును సహజ మరణంగా చూపెట్టడానికి తంటాలు పడి, చివరాఖరికి వర్క్ మెన్ కాంపన్సేషన్ కూడా ఇవ్వక పోవడాన్ని నాయకులు జీర్ణించు కోలేకపోయారు. తప్పుడు నివేదిక ఇచ్చిన వైద్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తు నేతలు హైదరాబాద్ వెళ్లి డీజీఎంఎస్ సుప్రియో చక్రబోర్తిని కలిసి పూర్తి వివరాలు అందజేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ఆందోళన వీడేది లేదంటూ ఖరాఖండిగా కార్మిక నేతలు చెప్తున్న తరుణంలో నేపథ్యంలో ‘ జనంసాక్షి ‘అందిస్తున్న ప్రత్యేక కథనం…
బెల్లంపల్లి డివిజన్ శాంతిఖని గనిలో ఏడు నెలల క్రితం జరిగిన ప్రమాద ఘటన మళ్ళీ మరోసారి తెరపైకి వచ్చింది. గనిలో ఆక్సిజన్ లభించక,
బొగ్గుచూరలో కూరుకుపోయి మృతి చెందిన లక్ష్మీనారాయణ కుటుంబానికి న్యాయం చేయాలంటూ కార్మిక సంఘాల జేఏసీ ఈ ఆందోళనకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా విధినిర్వహణలో ఉన్న కాంటాక్ట్ కార్మికునికి వర్క్ మెన్ కాంపెన్సేషన్(నష్ట పరిహారం) చెల్లింపులో సింగరేణి యాజమాన్యం అవలంభించిన వ్యవహారాన్ని జేఏసి తీవ్రంగా తప్పు పట్టింది. గత ఏప్రిల్ 4న చోటు చేసుకున్న ఈ ఘటనపై మసిబూసి మారేడు కాయ చేసే కోణంలో అటు సింగరేణి యజమాన్యం, ఇటు ప్రభుత్వ వైద్యులు వ్యవహరించడం పట్ల జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ప్రమాదంలో కార్మికుడు మృత్యువాత పడితే దాన్ని సహజమారణంగా ధ్రువీకరించేందుకు తప్పుడు నివేదికను సమర్పించడాన్ని జేఏసీ నాయకులు జీర్ణించు కోలేకపోయారు.
16 లక్షలు చెల్లించి తీరాల్సిందే…!?
శాంతిఖనిలో మృత్యువాత పడ్డ లక్ష్మీనారాయణ కుటుంబానికి వర్క్ మెన్ కాంపెన్సేషన్ కింద 16 లక్షలు చెల్లించి తీరాల్సిందేనని జేఏసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కేవలం కాంట్రాక్టర్ చేత ఐదు లక్షల నష్ట పరిహారాన్ని మొక్కుబడిగా చెల్లించడంతోనే సరి పెట్టుకున్న సింగరేణి యాజమాన్యం వర్కు మెన్ కాంపెన్సేషన్ మాత్రం విస్మరించడం ఏ మాత్రం సమంజసమని నాయకులు మండి పడుతున్నారు. అదేవిధంగా మృతుని కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రత్యామ్నాయంగా ఉద్యోగం కల్పించాలని డిమాండ్ ను సైతం అధికారులు పెడచెవిన పెట్టడం భావ్యం కాదని కూడా అంటున్నారు. ఏడు నెలలు గడుస్తున్నప్పటికీ నేటికీ ఉద్యోగ కల్పన అతిగతి లేకుండా పోయిందనే విమర్శలు సైతం ఈ సందర్భంగా వ్యక్తం అవుతున్నాయి. ఇంటి పెద్దదిక్కును కోల్పోయి ఇద్దరు పిల్లలు.. తల్లితో సహా కుటుంబాన్ని పోషించడానికి భార్య లక్ష్మి నానా అగచాట్లు పడుతోన్నా, అధికారులకు కాసింత కనికరం లేకుండా పోతున్నదనే అభిప్రాయాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే జేఏసీ నాయకులు బాధిత కుటుంబానికి బాసటగా నిలవాలనే సంకల్పంతో ఆందోళన బాట పట్టడానికి కసరత్తు చేస్తున్నారు.




