అన్నిరకాలుగా ఆదుకుంటామని కలెక్టర్ భరోసా
కుమురం భీం ఆసిఫాబాద్,నవంబర్30 (జనం సాక్షి) : జిల్లాలోని పెంచికల్‌పేట మండలం కొండపల్లి గ్రామంలో పులి దాడిలో చనిపోయిన బాలిక కుటుంబాన్ని అధికారులు పరామర్శించారు. పులిదాడిలో మృతిచెందిన బాలిక నిర్మల కుటుంబాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్, కవ్వాల్ ఫీల్డ్ డైరెక్టర్ వినోద్ కలిసి పరామర్శించారు. ప్రభుత్వపరంగా ఆదుకుంటామని భరోసానిచ్చారు. పులి ఆచూకీ కనుగొనేందుకు కొండపల్లి అటవీ ప్రాంతంలో అధికారులు పర్యటిస్తున్నారు. పులిని బంధించేందుకు బోన్లు ఏర్పాటు చేశారు. ఈనెల 11న దహెగాం మండలం దిగిడలో విఘ్నేశ్ అనే యువకుడిపై పులి దాడి చేసి హతమార్చిన విషయం తెలిసిందే.. ఇది జరిగిన 18 రోజుల్లోనే జిల్లాలో మరొకరు పులికి బలి కావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మూడ్రోజుల క్రితం పెంచికల్‌పేట్ మండలం అగర్‌గూడ శివారులో పెద్దవాగులో పులి సంచరిస్తుండగా యువకులకు కనిపించింది. అంతకు ముందు బెజ్జూరు, మంచిర్యాల జిల్లా వేమనపల్లి అటవీ ప్రాం తాల్లోనూ ఓ పులి కొందరి కంటపడింది. ఈ నేపథ్యంలోనే వ్యవసాయ పనుల నిమిత్తం పొలాలకు ఎలా వెళ్లాలని స్థానికులు వణికిపోతున్నారు. దహెగాం అడవుల్లో పులిని బంధించేందుకు బోన్లు ఏర్పాటు చేసినా చిక్కడం లేదు. కాగజ్‌నగర్ డివిజన్‌లో మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన ఆరు పులుల వరకు సంచరిస్తున్నాయి. తడోబా అందేరి టైగర్ రిజర్వులో పులులు సవిూప గ్రామాల్లోకి వచ్చి దాడులు చేసిన ఘటనలు అనేకం.. ఈ క్రమంలో అటువంటి ఘటనలే ఇక్కడా పునరావృతం అవుతుండటంతో అక్కడి జనం భయాందోళన చెందుతున్నారు.
బాలిక కుటుంబానికి అధికారుల పరామర్శ




