హైదరాబాద్: బాహుబలి-2 ప్రదర్శిస్తున్న సినిమా థియెటర్‌ల వద్ద రెవిన్యూ, వాణిజ్య పన్నుల శాఖ అధికారులను నియమించి టికెట్ల మాఫియాపై తక్షణ చర్యలు తీసుకొని.. సగటు ప్రేక్షకుడు ఈ సినిమాను వీక్షించుటకు అవకాశం కల్పించాలని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు, తెలుగు భాషా పరిరక్షణ వేదిక కన్వినర్, సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి ఓ ప్రకటనలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులను కోరారు.
‘బాహుబలి-2 సినిమా గొప్ప సాంకేతిక విలువలతో రాజహౌళితో పాటు చాలా మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు, నాలుగు సంవత్సరాలు కష్టపడి తెరకెక్కించారు. ఈ సినిమా విడుదల భారతీయ సినిమా వైభవానికి ఒక మహోత్తర దినం. కానీ.. బ్లాక్ టికెట్ల మాఫియా మూలంగా ఈ సినిమా చూడాలనే సగటు ప్రేక్షకుడి ఆశకు గండి పడింది. అసలు ప్రేక్షకులు మేం ఎందుకు ఎక్కువ ధర చెల్లించి సినిమా చూడాలి? అని థియెటర్ యాజమాన్యంతో కొన్ని ప్రాంతాల్లో గొడవలు పడి పోలీస్ స్టేషన్‌ల వరకు వెళ్లారు. అటు ఆంధ్రప్రదేశ్‌లో ఇటు తెలంగాణలో ఈ టికెట్ల మాఫియా విచ్చలవిడిగా చెలరేగిపోతూ భారీ ఎత్తున ఎక్కువ ధరలకు విక్రయించడం ప్రభుత్వాలు ప్రేక్షక పాత్ర పోషించడం ప్రజలు సహించలేక పోతున్నారు’ అని కేతిరెడ్డి తెలిపారు.




